తిరుమలలో దొంగల ముఠా అరెస్ట్
తిరుమల: గత కొన్ని రోజులుగా తిరుమల, తిరుపతికి వస్తున్న భక్తులే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. చిత్తూరు జిల్లా ఓజీకుప్పం గ్రామానికి చెందిన ఆరుగురు, కర్నూలు జిల్లా సిద్ధాపురం గ్రామానికి చెందిన ముగ్గురు తిరుమల, తిరుపతిలో రెండు ముఠాలుగా ఏర్పడి తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం 9 మంది నిందితులను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 15 లక్షల విలువ చేసి బంగారు ఆభరణాలను, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, వీరందరిపై ఇప్పటికే తిరుమల, తిరుపతి పోలీస్‌స్టేషన్లలో 21 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.