గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని హల్‌కట్ట రైల్వేస్టేషన్ (కర్ణాటక)లో క్రాసింగ్ కోసం ఆగివున్న కొల్హాపుర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నంబర్ :11303)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు నలుగురు దొంగలు మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు, గుంతకల్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా... హైదరాబాద్ నుంచి కొల్హాపుర్ వెళుతున్న రైలు క్రాసింగ్ కోసం వాడి-మంత్రాలయం సెక్షన్ లోని హల్‌కట్ట రైల్వేస్టేషన్‌లో ఆగింది. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులను నిలువుదోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. బోగీలో ముగ్గురు ప్రయాణికులు మేల్కొని ఉండటాన్ని గమనించి.. అరిస్తే చంపుతామని మారణాయుధాలతో బెదిరించారు.
నిద్రలో ఉన్న అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడు తండాకు చెందిన గోవిందునాయక్ అనే ప్రయాణికుడి ప్యాంటు జేబు కత్తిరించి రూ. 15 వేల నగదు లాక్కున్నారు. మెడలోని బంగారు గొలుసునూ లాక్కోవడానికి ప్రయత్నించగా.. అతను ప్రతిఘటించి కేకలు పెట్టాడు. దీంతో ప్రయాణికులంతా నిద్రలేచారు. ఈ హఠాత్పరిణామంతో దొంగలు రైలు దిగి పరారయ్యారు. ప్రయాణికులు గుంతకల్లు జీఆర్‌పీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.