రోగికి మందులు, భోజనం ఇస్తున్న రోబో
మొరం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త పవన్ కరోనా రోగులకు సేవలందించే డాక్టర్లకు తియ్యని కబురు చెప్పారు. వైద్యులు తరచూ రోగి వద్దకు వెళ్లకుండా సేవలందించడానికి రోబో సినిమాలో చిట్టిని తలపించే ఓ రోబోను రూపొందించాడు. ఆ మర మనిషిని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి పలువురితో శభాష్ అనిపించుకున్నారు.
సాక్షి, పలమనేరు : కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం చేసే సమయంలో వైరస్ డాక్టర్లకు సోకకుండా పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు కోవిడ్–19 పేరిట ఓ రోబోను తయారు చేశాడు. చదివింది ఏడో తరగతైనా ఇప్పటికే పలు ప్రయోగాలతో గ్రామీణ శాస్త్రవేత్తగా పేరు గడించాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ రోగులకు చికిత్స చేసే వైద్యులు, నర్సులకు వైరస్ సోకడం, కొందరు తాజాగా మృతి చెందడం తెలిసిందే. దీంతో కలత చెందిన పవన్ కోవిడ్ రోబోను తయారు చేసినట్లు తెలిపాడు.
కేవలం రూ.15 వేల ఖర్చుతోనే..
స్థానికంగా దొరికే వస్తువులైన నాలుగు డీసీ మోటార్లు, 12 ఓల్టుల 7 ఏహెచ్ బ్యాటరీ, ఓల్టేజ్ రెగ్యులేటర్, 360 డిగ్రీ కెమెరా, వాయిస్ కంట్రోల్ మాడ్యూల్, మోటార్ డ్రైవ్‌లతో దీన్ని తయారు చేశాడు. పైన ప్రయోగాత్మకంగా ధర్మాకోల్‌ను వినియోగించాడు. దీనికి ఒక్కసారి చార్జ్ చేస్తే నాలుగు రోజుల దాకా పనిచేస్తుంది. కేవలం పది రోజుల వ్యవధిలో రూ.15 వేల ఖర్చుతో దీన్ని తయారు చేశాడు.
ఇదెలా పనిచేస్తుందంటే..
ఆస్పత్రిలోని రోగులకు అవసరమైన మందులు, భోజనం తదితరాలను తీసుకెళుతుంది. ఇందులో అమర్చిన టూవే కమ్యూనికేషన్ సిస్టం ద్వారా రోగి, వైద్యులు మాట్లాడుకోవచ్చు. ఇందులో అమర్చిన కెమెరా ద్వారా రోగి ఏం చేస్తున్నాడో వైద్యులు తమ గదిలోని స్క్రీన్‌పై చూడవచ్చు. 360 డిగ్రీలతో పనిచేసే కెమెరాతో రోగి నలువైపులా ఫొటోలు తీస్తుంది. దీంతో వైద్యులు, సిబ్బంది రోగి వద్దకు వెళ్లకుండానే వారితో మాట్లాడడం, సూచనలివ్వడం, ట్యాబెట్లను పంపడం చేసుకోవచ్చు. రోబోకు సంబంధించిన ప్రోగ్రామింగ్ రిమోట్ సిస్టమ్ డాక్టర్ల వద్ద ఉంటుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. 100 మీటర్ల రేంజి దాకా పనిచేస్తుంది.
ప్రయోగాత్మకంగా..
తాను తయారు చేసిన రోబోను పవన్ పలమనేరు మండలంలోని ఇమ్మాస్విస్ ఆస్పత్రిలో రెండ్రోజుల క్రితం ప్రదర్శించాడు. అక్కడి వైద్యుల సమక్షంలో పేషంట్ల వద్దకు మందులను తీసుకెళ్లడం, రోగితో వైద్యులు మాట్లాడడం, రోగి తన సమస్యలను వైద్యులకు చెప్పడం విజయవంతంగా చేసింది.
తిరుపతి కోవిడ్ ఆస్పత్రికి ఓ రోబో ఉచితంగా ఇస్తా..
కరోనా వైరస్ వైద్యులు, సిబ్బందికి సోకకుండా దీన్ని తయారు చేశా. వైద్యులు ప్రాణాలతో ఉంటేనే రోగులు బాగుంటారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ ఆస్పత్రి తిరుపతిలో ఉంది. ఆ ఆస్పత్రికి ఓ రోబోను ఉచితంగా అందజేస్తా. కరోనాపై మానవజాతి విజయం సా«ధిస్తుందనే నమ్మకం ఉంది.
– పవన్, గ్రామీణ శాస్త్రవేత్త, మొరం గ్రామం,పలమనేరు మండలం
Comments
Please login to add a commentAdd a comment