రాజధాని కోసం రణం చేద్దాం
- సీమలో రాజధాని ఏర్పాటు చేయాలని నినదించిన నేతలు
- సమైక్యంగా ఉద్యమించాలని పిలుపు
- ప్రొద్దుటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం
ప్రొద్దుటూరు: రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రాయలసీమ వాసులం ఎంతో నష్టపోయామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు కోసం వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. దీనికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తాను రాజధాని సాధనకోసం ఎంత వరకైనా పోరాడతానన్నారు. ముందుగా అందరం కలిసి ప్రధానమంత్రికి విన్నవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం మనం మేల్కొనకపోతే మళ్లీ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ గతంలో సాగునీటికి సంబంధించి అటు కర్నాటక, ఇటు మహారాష్ట్రలతో పోరాటం చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం తెలంగాణ కూడా ఇందుకు తోడైందన్నారు. శ్రీశైలం ద్వారా 13 జిల్లాలకు సాగు నీరు అందుతోందన్నారు. కడపలో హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఫార్మా కంపెనీలను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రిమ్స్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎయిమ్స్‌గా మార్చాలని, ఎర్రచందనం, బెరైటీస్‌లతో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ గతంలో మనకు చాలా అన్యాయం జరిగిందని, అప్పుడు పోరాటాలు చేయలేకపోయామన్నారు. నాడు ఉద్యమ స్ఫూర్తితో తుపాకి గుండ్లకు ఎదురొడ్డి పోరాటం చేశారని, నేటి పరిస్థితులు వేరుగా ఉన్నాయని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్థాయిని 12వేల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచారని తెలిపారు. 1983లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చీఫ్ ఇంజనీర్ శివరామకృష్ణ ద్వారా కమిటీ వేసి సాగునీటిపై శ్రద్ధ చూపించారన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ రతనాల సీమ రాయలసీమ నేడు అన్ని విధాలా దోపిడీకి గురైందన్నారు. విద్య, వైద్యం, అన్నింటా నష్టం జరిగిందన్నారు. ఐక్యంగా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమం చేసేందుకు సమయం ఆసన్నమైందన్నారు. కోస్తా వారితో రాయలసీమ వాసులం తరచూ నష్టపోతున్నామన్నారు. కోస్తాలో 25.70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుండగా రాయలసీమలో 2 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోందన్నారు. అలాగే మనకు కేవలం 670 పరిశ్రమలు మాత్రమే ఉండగా కోస్తాలో 1918 పరిశ్రమలు ఉన్నాయన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమలో రాజధాని ఎందుకు ఏర్పాటు చేయకూడదో తెలపాలన్నారు. అన్నింటికి విజయవాడే అనుకూలమని టీడీపీ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. మనకు రోడ్డు మార్గాలు బాగున్నాయని, రవాణాకు అనుకూలంగా ఉందని, భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా లేదన్నారు. తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో చర్చించి వారితో ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
ఆర్‌ఎస్‌ఎఫ్ కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ కోస్తాలో సాగు నీటి ద్వారా ఏటా 8వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. అక్కడ 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుండగా సాగునీటి అవకాశం కూడా వారికే ఉందన్నారు. రాయలసీమలో 600 మి.మీ. వర్షం పాతం ఉండగా సాగు నీరు కూడా లేక కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడా కూడా రాష్ట్ర రాజధాని రాష్ట్రం మధ్యలో లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్‌ల వరకు రాజధాని సాధన కోసం తీర్మానాలు చేయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజా ఉద్యమానికి అందరూ సహకరించాలని కోరారు.
ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఆలస్యం అయిందని, వెంటనే ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ఉద్యోగులంతా ఇందుకు సహకరించాలన్నారు.
రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ ఎన్నెస్ ఖలందర్ మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం తొలుత అందరం చెన్నైలోని కాశీనాథుని నాగేశ్వరరావు ఇంటికి వెళ్లాలన్నారు. అక్కడి నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్మోహన్‌రెడ్డి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి చెన్నా రాఘవేంద్రనాథ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రామయ్య, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి,ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ కోశాధికారి టీవీ రమణారెడ్డి, రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి చిప్పగిరి ప్రసాద్, కౌన్సిలర్ పిట్టా శ్రీనివాసులు, ఎస్‌టీయూ నాయకులు శ్రీనివాసులు, రషీద్‌ఖాన్, రచయిత జింకా సుబ్రమణ్యం, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రమణారెడ్డి, షేక్షావల్లి తదితరులు ప్రసంగించారు.