
నేడు ర్యాగింగ్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం
♦ సమాజంలో మార్పు కోసం సాక్షి, సాక్షి టీవీ ప్రయత్నం
♦ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించే అవకాశం
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ర్యాగింగ్ సంఘటనలు వరసగా జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మానసిక ఎదుగుదల లేక కొందరు, చట్టాలపై అవగాహన లేక మరికొందరు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువై ఇంకొందరు.. ర్యాగింగ్‌కు పాల్పడుతూ ఎదుటివారి జీవితాలతోపాటు తమ జీవితాలనూ బలి చేసు కొంటున్నారు. దీనికి జిల్లాలో ఇటీవల జరిగిన విద్యార్థినులు రిషితేశ్వరి, సునీత ఘటనలే ప్రత్యక్ష ఉదహరణలు. ర్యాగింగ్ మహమ్మారికి రిషితేశ్వరి బలై తల్లిదండ్రులకు కడుపుకోతను మిగల్చగా.. తానే ర్యాగింగ్‌కు పాల్పడి ప్రిన్సిపల్ మందలించారనే మనస్థాపంతో సునీత బలవన్మరణానికి పాల్పడి తన తల్లిని ఒంటరిని చేసింది.
ర్యాగింగ్‌కు ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇద్దరు విద్యార్థినులు బలికాగా, మరో ముగ్గురు కటకటాల పాలై తమ జీవితాలను అంధకారం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తన వంతుగా ‘సాక్షి’ స్పందించింది.ర్యాగింగ్‌పై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, సమాజంలో కూడా మార్పు రావాలనే తలంపుతో సాక్షి, సాక్షి టీవీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాగింగ్‌పై రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నది. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి సారధ్యంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరుగుతుంది.
గుంటూరు రూరల్ సీసీఎస్ ఏఎస్పీ శోభామంజరి, ఏఎన్‌యూ మాజీ వీసీ వియన్నరావు, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే), జీజీహెచ్ మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణ, పీడీఎస్‌ఓ రాష్ట్ర కమిటీ నాయకురాలు వెన్నెల, ఐద్వా నాయకురాలు వరలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు, అన్ని వర్గాల ఔత్సాహికులు హాజరై తమ అభిప్రాయాలు చెప్పవచ్చు.