
రూ.150 కోట్లు తాగేశారు!
* నూతన సంవత్సర వేడుకల్లో ఏపీలో మద్యం అమ్మకాలు
* వైజాగ్, విజయవాడ, గుంటూరులో అమ్మకాల జోరు
* సంక్రాంతి పండుగకు భారీగా నిల్వ చేస్తున్న మద్యం వ్యాపారులు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 150 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. డిసెంబరు 31తో పాటు జనవరి 1 కలిపి అమ్మకాలు రూ. 150 కోట్లు దాటినట్లు అధికారులు ధ్రువీకరించారు. సాధారణంగా రాష్ట్రంలో సగటున నెలకు రూ. 700 కోట్లు వరకు అమ్మకాలు సాగుతున్నాయి. అంటే 13 జిల్లాల్లో కలిపి రోజుకు సగటున రూ. 23 కోట్లు తాగుతున్నారు. అయితే డిసెంబరు 31న సుమారు ఎనిమిది రెట్లు అధికంగా విక్రయాలు జరగడం విశేషం. న్యూ ఇయర్ వేడుకలకు ప్రధానంగా వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్కువగానూ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమ్మకాలు గణనీయంగానూ పెరిగాయి. ఈ మూడు జిల్లాల్లోనే రూ. 50 కోట్లకు పైగా మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని మద్యం వ్యాపారులు గత వారం నుంచే ఆయా జిల్లాల్లోని ఏపీబీసీఎల్ నుంచి సరుకు కొనుగోలు చేశారు. ముఖ్యంగా మద్యం విక్రయాల్లో బీరు అమ్మకాలే అధికంగా ఉన్నాయి. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమయంలో రూ. 200 కోట్ల అమ్మకాలు సాగితే 13 జిల్లాల్లో ఈ ఏడాది రూ. 150 కోట్లు దాటిపోయాయి. ఇక తమకు టార్గెట్లు పెట్టి ఉంటే మద్యం అమ్మకాలు రూ. 200 కోట్లు దాటేవని ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఎక్సైజ్ ఏడాదికి రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఒక పక్క ప్రభుత్వం అంచనా వేస్తుండగా.. దానికి మించి ఈ దఫా అమ్మకాలుంటాయని ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సీజన్‌లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. జనవరి నెలలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరులలో మద్యం అమ్మకాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం సిండికేట్లు పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మద్యం షాపులు అధికంగా ఉన్నందున ఈ జిల్లాల్లోనే మద్యం స్టాకు ఉంచుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో భారీ అమ్మకాలు జరిగితే, సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా విక్రయాలు జరుగుతాయి. మొత్తానికి మద్యం ఆదాయం ఏపీ ప్రభుత్వానికి బాగానే ‘కిక్కు’ ఇస్తున్నట్లుంది.