ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రూ.150 కోట్లు, దీర్ఘకాలిక రుణాలుగా మరో రూ.50 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి వెల్లడించారు.
తాండూరు, కుల్కచర్ల, న్యూస్‌లైన్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రూ.150 కోట్లు, దీర్ఘకాలిక రుణాలుగా మరో రూ.50 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన తాండూరు సివిల్ సప్లయ్ గోదాం ఆవరణలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కుల్కచర్లలో ప్రాథమిక సహకార సంఘ పాలక వర్గం సభ్యులతోనూ సమావేశమయ్యారు. ఈ రెండు చోట్లా మాట్లాడుతూ జిల్లాలోని 49 సహకార సంఘాల్లో కుల్కచర్ల సహకార సంఘం వెనుకబడి ఉందని రూ.ఆరు కోట్లు రుణంగా పంపిణీ చేసి కేవలం 25శాతం కూడా రికవరీ చేయలేదని అన్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని, ఇదే పరిస్థితి జూన్ వరకూ కొనసాగితే చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని మరో 12 ప్రాథమిక సహకార సంఘాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల పరిధిలో సుమారు 365 మంది పెద్ద రైతుల వద్ద నుంచి రూ.30కోట్ల వరకు దీర్ఘకాలిక రుణాలు వసూలు కావాల్సి ఉన్నాయన్నారు.
ఈనెల 10 వరకు గడువు ఇచ్చామని, అప్పటికీ చెల్లించకుంటే వారికి చెందిన సుమారు మూడు వేల ఎకరాలను వేలం వేస్తామని స్పష్టం చేశారు. గత ఏడాది పంట రుణాలుగా రూ.122 కోట్లు, దీర్ఘకాలిక రుణాలుగా మరో రూ.10కోట్లు ఇచ్చామన్నారు. ఇందులో 75శాతం రుణాలు రికవరీ అయ్యాయని వెల్లడించారు. గత ఏడాది బంగారంపై రూ.70కోట్ల రుణాలు ఇచ్చామని, ఈ సారి రూ.100 కోట్ల వరకు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పంట నష్ట పరిహారంగా సుమారు రూ.నాలుగు కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.
కుల్కచర్ల ప్రాథమిక సహకార సంఘం పరిధిలో బకాయిలు చెల్లించని 12 మంది భూములను ఈ నెలలో వేలం వేయనున్నట్టు వెల్లడించారు. తాండూరులో నిర్వహించిన సమావేశంలో డీసీఎంఎస్ డెరైక్టర్ ధారాసింగ్, యాలాల, తాండూరు పీఏసీఎస్‌ల చైర్మన్లు సిద్రాల శ్రీనివాస్, నారాయణగౌడ్, డీపీసీ మాజీ సభ్యులు పి.నర్సింహులు, డీసీఎంఎస్ జిల్లా మేనేజర్ శివారెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జనార్దన్‌రావు, తాండూరు ఏడీఏ బసవరాజు, డీసీఎంఎస్ తాండూరు బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, ఏఎంసీ సూపర్‌వైజర్ హబీబ్ అల్వీలు కుల్కచర్లలోని విలేకరుల సమావేశంలో స్థానిక ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు బీంరెడ్డి, ఉపాధ్యక్షుడు వీరసింహారెడ్డి, సభ్యులు ప్రహ్లద్‌రావు, సేరి రాంరెడ్డి, నాగరాజు, కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, సీఈఓ రాందాస్, బీజేపీ నాయకులు వెంకటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.