నంద్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది స్వాహాపర్వానికి పాల్పడినట్లు తెలిసింది. స్పెషల్ ఆఫీసర్ పాలన కావడంతో ఇష్టారాజ్యంగా బిల్లులను డ్రా చేశారు. మున్సిపల్ కార్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన అకౌంటెంట్ జనరల్ ఆడిట్‌లో రూ.25 లక్షలకుపైగా వ్యయానికి బిల్లులు, ఓచర్లు లేని విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ అక్రమాన్ని మేనేజ్ చేయడానికి సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికలు గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగాయి.
ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు రూ.80 లక్షలను రిజర్వ్ చేస్తూ స్పెషల్ ఆఫీసర్ అనుమతి తీసుకున్నారు. కాని ఎన్నికల వ్యయానికి రూ.21 లక్షలను కేటాయించినట్లు తెలిసింది. కాని నిధులు సరిపోలేదని రూ.64 లక్షలు జనరల్ ఫండ్స్, ఇతర నపద్దుల నుంచి రూ.14 లక్షలు బదలాయించి, ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల వ్యయానికి సంబంధించిన రికార్డులు, సమాచారాన్ని సిబ్బంది గోప్యంగా దాచారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్ సమాచార హక్కు చట్టం ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను కోరగా, సిబ్బంది అసమగ్ర సమాచారాన్నిచ్చి, చేతులు దులుపుకున్నట్లు సమాచారం.
వెలుగులోకి అక్రమాలు..
ఎన్నికల వ్యయంలో జరిగిన అక్రమాలు ఆడిట్‌లో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మూడు రోజుల క్రితం అకౌంటెంట్ జనరల్ కార్యాలయ సిబ్బంది 2011-12 నుంచి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల వ్యయంలో పలు అక్రమాలు వెలుగు చూసినట్లు సమాచారం. స్టేషనరీ, భోజనాలు, సప్లయర్స్, పలు ఖర్చులకు సంబంధించి బిల్లులు, ఓచర్లు లేకుండానే డబ్బు డ్రా చేసినట్లు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ అనుమతి ఉందనే సాకుతో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన జనరల్ ఫండ్స్ నుంచి రూ.64 లక్షలు, ఇతర ఖాతాల నుంచి రూ.14 లక్షలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఆడిట్‌లో ఈ అక్రమాలు బయట పడటంతో ఎన్నికల విధులను నిర్వహించిన సిబ్బంది వెన్నులో వణుకు మొదలైంది. నకిలీ బిల్లులను సృష్టించి పంపించుకోవడానికి, ఆడిట్ సిబ్బందిని మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను ఆడిట్ అధికారులు వెల్లడించడం లేదు.
రూ. 25 లక్షలు స్వాహా!
Published Sat, Feb 7 2015 1:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement