రూ.350 కోట్లతో మెడికల్ కాలేజీ
Published Fri, Sep 20 2013 3:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
అన్నెపర్తి (నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్ :జిల్లా కేంద్రంలో రూ.350 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.150 కోట్లతో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం అన్నెపర్తి బెటాలియన్ వద్ద రూ.15 కోట్లతో చేపట్టిన కృష్ణా తాగునీటి పనులకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధిలో పునరంకితమవుతామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం పానగల్లు నుంచి నార్కట్‌పల్లి వరకు ప్రత్యేక కృష్ణా పైప్‌లైన్ వేస్తున్నట్లు తెలిపారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో శ్రీశైలం సొరంగమార్గం, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టుల మంజూరయ్యాయని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో నార్కట్‌పల్లి మండలంలోని ఆమ్మనబోలు వరకు తాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ కోసం తనతోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు ఎంతో పోరాటం చేశారన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకునేందుకు సీఎంతో సహ సీమాంధ్ర మంత్రులు ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారని, ఈ ప్రాంత మంత్రులు క్యాబినేట్ నోట్ పెట్టే విధంగా ఒత్తిడి చేయాలన్నారు.
సీఎంను తెలంగాణ మంత్రులు నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ ఒక పక్క అభివృద్ధి, మరో వైపు తెలంగాణ ఉద్యమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య,జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, అన్నెపర్తి సర్పంచ్ ఎదుళ్ల పుష్పలత, కమాండెంట్ బాబుజీరావు, రేగట్టె నర్సింహారెడ్డి, నాయకులు ఉట్కూరి వెంకట్‌రెడ్డి, తుమ్మల లింగస్వామి యాదవ్, భిక్షంగౌడ్, బోధనపు వెంకట్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement