
సాక్షి, అమరావతి బ్యూరో: మనందరి ప్రభుత్వం రాగానే దూదేకుల ఫెడరేషన్‌కు ఏటా రూ.40 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి శివారులో బుధవారం ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా/దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దూదేకుల ముస్లింలకు ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేసి, నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత నేత రాజశేఖరరెడ్డిదే అని అన్నారు.
2014లో దూదేకుల ముస్లిం ఫెడరేషన్ ఏర్పాటు అయినప్పటికి ప్రభుత్వం ఇప్పటివరకు కార్యవర్గాన్ని రూపొందించలేదని, నాలుగేళ్లుగా నామమాత్రపు నిధులు కేటాయించిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దూదేకుల కులస్తులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సదస్సులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి ఏఎమ్ రఫీ, జాయింట్ సెక్రటరీ ఖాజా, అబ్బాస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.