ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒప్పందాల పత్రాలు అందజేస్తున్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భాగస్వామ్య సదస్సులో దేశీయ, విదేశీ పారిశ్రామికవేత్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 4,253 మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా రూ. 4.39 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 50 దేశాల నుంచి 280 మంది విదేశీ ప్రతినిధిలు, 3,673 మంది దేశీయ పారిశ్రామికవేత్తలు, 30 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
వరుసగా మూడవ ఏడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సోమవారం ముగిసింది. ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో భాగస్వామ్యులు కావడానికి విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారని, ఈసారి జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ కంట్రీల సెషన్స్ జరిగాయని, వచ్చే ఏడాది శ్రీలంక, రష్యా సెషన్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఒప్పందాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సష్టించిందని సీఎం వెల్లడించారు. మూడున్నరేళ్లలో మొత్తం 1,946 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.13.54 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 31 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు.
వసతులు ఉపయోగించుకోండి: గవర్నర్
పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇక్కడ అన్ని రకాల మౌలికవసతులు ఉండటమే కాకుండా, అన్ని రకాల భద్రత ఉంటుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహన్ మాట్లాడుతూ.. హైవే, రేవులు, రోడ్డు కనెక్టివిటీతో పాటు కమ్యూనికేషన్స్, ఇంధన భద్రత పరంగా రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment