క్రికెట్ బెట్టింగ్ ఆడితే రౌడీషీట్
► ప్రత్యేక బృందాలతో దాడులు
► పది మంది బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్
► రూ. 5.02 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం
► కీలక బుకీ శివారెడ్డి కోసం ముమ్మర గాలింపు
► డీఎస్పీ మల్లికార్జునవర్మ వెల్లడి
అనంతపురం : బెట్టింగ్ ఆడుతూ పట్టుబడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ హెచ్చరించారు. ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు రూరల్, వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి పది మంది క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.02 లక్షల నగదు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సోమవారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వివరించారు. టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రోజున క్రికెట్ పందేలపై నిఘా ఉంచారు. డీఎస్పీ మల్లికార్జునవర్మ పర్యవేక్షణలో అనంతపురం రూరల్ సీఐ ఎంఆర్ కృష్ణమోహన్, ఎస్‌ఐలు జగదీష్, నాగేంద్రప్రసాద్, వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు.
సిండికేట్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న కోమల మహమ్మద్ రఫి, గొల్ల గోపాల్, కవ్వల పెద్దిరాజు అలియాస్ మహేష్, ముత్తులూరి లోకేష్ అలియాస్ బాలు, గాలం మారుతీప్రసాద్‌ను అరెస్ట్‌చేశారు. వీరి నుంచి రూ. 3,80,500 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానిక హౌసింగ్‌బోర్డు రాజీవ్ చిల్డ్రన్ పార్కు వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నీరుగంటివీధికి చెందిన దంపెట్ల శివయ్య, యర్రగుంట నారాయణరెడ్డి, సాకే కేశవర్ధన్, సాకే రామాంజనేయులు, షేక్ సాదిక్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 1,21,500 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కీలక బుకీ అయిన శివారెడ్డి పరారీలో ఉన్నాడు.
అతనికోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిలో కొందరు విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యసనానికి లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. క్రికెట్ బెట్టింగ్‌ల్లో దొరికితే కచ్చితంగా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో రూరల్ సీఐ కృష్ణమోహన్, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.