
రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజాంపేట సమీపంలోని రామాపురం చెక్పోస్ట్ వద్ద రెండు లారీల్లో భారీగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు శనివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. రెండు లారీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అలాగే అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలం శెట్టిపల్లె వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న18 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేశారు. అనంతరం కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేశారు.