రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు
తూర్పుగోదావరి, బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సంక్రాంతి పండగకు సొంతూరు వచ్చి తిరిగి పయనమవున్న వారికి ఆర్టీసీ, రైల్వేశాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులు లేకపోవడంతో గంటల తరబడి రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం రైల్వే, బస్‌స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు రెండు, మూడు రెట్లు పెంచడంతో ప్రయాణికుల జేబులు ఖాళీ అవుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా కాకినాడ డిపో నుంచి దూరప్రాంతాలకు సుమారు 70 ఆర్టీసీ బస్సులను అదనంగా నడుపుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడకు అదనపు సర్వీసులు నడుపుతున్నారు. పలాస, పాడేరు, శ్రీకాకుళంకు సర్వీసులు నడుపుతున్నారు. సాధారణ రోజుల్లో కాకినాడ నుంచి బెంగళూరు ఏసీబస్‌కు టిక్కెట్టు ధర రూ.1,800 ఉండగా, ప్రస్తుతం నాన్‌ఏసీ బస్సులకు రూ. 1,700 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో రూ.650 ఉండగా, ప్రస్తుతం రూ.950 వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదను చూసి బాదేస్తున్న ప్రయివేట్ ట్రావెల్స్
సాధారణ రోజుల్లో ప్రయివేట్ ట్రావెల్స్‌లో హైదరాబాద్‌కు వెళ్లేందుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకూ ఉండేది. ప్రస్తుతం రూ.2 వేల నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు.
నిలబడేందుకు జాగా లేకున్నా..
బస్సులో నిలబడేందుకు కూడా జాగా లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ఆర్టీసీ, రైళ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. ఉన్న సర్సీసులను వదులుకుంటే వేరే సర్వీసుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయపడి ప్రయాణికులు నిలబడే ప్రయాణం చేస్తున్నారు.
‘ప్రత్యేకం’ పేరుతో పల్లెవెలుగు
పల్లె వెలుగు, సిటీ బస్సులకు ‘ప్రత్యేకం’ బోర్డులు తగిలించి రెట్టింపు ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు నిలువునా దోచేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చినవారికి డొక్కు బస్సులు వేసి తిరుగు ప్రయాణంలో నరకం చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment