ఆగిన రథచక్రాలు.. | Rtc Buses Communion stoped | Sakshi
Sakshi News home page

ఆగిన రథచక్రాలు..

Published Thu, May 7 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

Rtc Buses Communion stoped

స్తంభించిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు
తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
స్పందించని ప్రభుత్వంపై మండిపడ్డ కార్మికులు

 
అనంతపురం రూరల్ : కార్మికుల సమ్మెతో ఆర్టీసీ రథచక్రాలు ఆగిపోయాయి. దీని కారణంగా వందలాది బస్సులు రోడ్డెక్కలేదు. ప్రజానీకం గమ్యస్థానాలు చేరడం కోసం నానా అవస్థలు పడ్డారు. అసలే వేసవి కాలం కావడంతో బస్సుల కోసం గంటలతరబడి నిరీక్షించి అలసిపోయారు. లక్షల మంది ప్రయాణాలను విరమించుకున్నారు. అదే స్థాయిలో ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ భయం గుప్పిట్లో ప్రయాణించారు. జిల్లాలోని 12 డిపోల్లో సమ్మె తీవ్రంగా సాగింది.

అనంతపురంతో పాటు, హిందూపురం, పెనుకొండ, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, ధర్మవరం, రాయదుర్గం, పుట్టపర్తి, మడకశిర, కదిరి డిపోల్లో ఆర్టీసీ కార్యకలాపాలు స్తంభించాయి. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయే బస్టాండ్లు వెలవెలబోయాయి. గత్యంతరం లేక రైలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.  ప్రైవేట్ వాహనదారులు దోపిడీకు ప్రజలు బలయ్యారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న జీపులు, వ్యాన్‌లు, బస్సుల నిర్వాహకులు అధిక రేట్లతో బస్సులు తిప్పారు.

ఇదిలా ఉండగా అధికారులు బస్సులు తిప్పేందుకు ప్రయత్నించగా ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, కార్మికులు తిప్పికొట్టారు. బస్సులకు అడ్డంగా పడుకుని అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం సైతం ఎక్కడా ఆస్తి నష్టం కల్గకుండా ప్రత్యేక పోలీసులు బలగాలను రంగంలోకి దింపారు. ఘర్షణలకు దారితీయకుండా పోలీసులు సమన్వయం పాటించారు. అధికారులు కార్మికుల కన్నుగప్పి హైర్ బస్సులను దొంగగా తిప్పారు. ఊరి సరిహిద్దు ప్రాంతాల నుంచి బస్సులను తిప్పారు. ఇది తెలుసుకున్న నేతలు పాతవూరు, కళ్యాణదుర్గం బైపాస్, కలెక్టరేట్ వద్ద బస్సులను ఆపారు. బస్సులు తిప్పతే ఉపేక్షించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు.

 అల్లాడిపోయిన ప్రజానీకం
 సమ్మె కారణంగా వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. అసలే వేసవి సెలవులతో పాటు, పెళ్లిళ్ల సందడి కారణంగా ఆర్టీసీకు మంచి సీజన్ సమయంలో బస్సులు ఆగిపోయాయి. ప్రయాణికులు ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా అంటూ ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. తల్లిదండ్రులు చిన్నపిల్లలను వెంటబెట్టుకుని బస్టాండ్‌లో గంటల తరబడి నిలుచుండిపోయారు. ఇక ఎంతో మంది చేసేది ఏమీ లేక ఇళ్లకు వెళ్లారు.

 ప్రైవేట్ వాహనాలకు భలే గిరాకీ
 ఆర్టీసీ సమ్మె కావడంతో ప్రైవేట్ వాహనాలకు మంచి గిరాకీ లభించింది. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పాటు మినీ వ్యాన్‌లు, డీజిల్ ఆటోలు, సూమోలు వివిధ ప్రాంతాలకు తిప్పారు. సందట్లో సడేమియా అంటూ డబ్బులు ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. ప్రయాణికులు గత్యంతరం లేక అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు.

 కిక్కిరిసిన రైల్వే స్టేషన్
 ఆర్టీసీ బస్సులు తిప్పకపోవడంతో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించారు. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి, పెనుకొండ రైల్వే స్టేషన్‌లలో వేలాది మంది ప్రయాణికులు తరలివచ్చారు. రైళ్లలో  సీట్లు దొరక్క నానా తంటాలు పడ్డారు. అందులోనూ అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ కావడంతో పెద్ద తలనొప్పిగా మారింది. రైల్లో కిందనే కూర్చుని మరీ వెళ్లారు.

 డిపో ముందు ఉద్రిక్తత
  హైదరాబాద్ నుంచి బస్సులు తిప్పడానికి స్పెషల్ ఆఫీసర్‌గా శ్రీహరి వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో డిప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఎంఈ శ్రీలక్ష్మి, డీఎం రమణ బస్సులు తిప్పేందుకు రంగం సిద్దం చేశారు. మొదట గుత్తికు రెండు సర్వీసులు తిప్పాలని చూశారు. డిపో ముందు బస్సులు పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కార్మికులు రెచ్చిపోయారు. తమపై ఎక్కించి మరీ బస్సులు తిప్పాలన్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుపడడంతో కార్మికులు లోపలికి వెళ్లలేదు.

 పోలీసుల పహారా:
  డీఎస్పీ మల్లికార్జున వర్మ నేతృత్వంలో త్రీటౌన్, వన్‌టౌన్ పోలీసులతో పాటు రోప్‌పార్టీ, స్పెషల్ పార్టీ పోలీసులతో డిపో ఆవరణం నిండిపోయింది. ఎక్కడ బస్సులు ధ్వంసం చేస్తారేమోనని ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 సమ్మెకు మద్దతు...సమ్మె చేపడుతున్న ఆర్టీసీ ఈయూ, ఎన్‌ఎంయూకు ఏఐటీయూసీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలన్నారు. వివిధ పార్టీ నేతలు జాఫర్, దాదా గాంధీ, తదితరులు మద్దతు తెలిపారు.

 బంద్ ఎఫెక్ట్‌పై ప్రయాణికుల అభిప్రాయాలు...
 ఉదయం నుంచి వేచి ఉన్నాం - కల్పన(అనంతపురం): తాడిపత్రిలో మా బంధువుల పెళ్లికి వెళ్లాలి. ఉదయం నుంచి వేచి ఉన్నాం. ఒక్క బస్సు రాలేదు. ప్రైవేట్ వాహనాల్లో ఏవిధంగా వెళ్లాలి. సమస్యను పరిష్కరించి త్వరగా బస్సులు తిప్పాలి.  
 ఇక్కడొచ్చి ఇరక్కపోయాం - హబీబా(ధర్మవరం) : ధర్మవరం నుంచి పొద్దునే వచ్చాం. గుంతకల్లు దర్గాకు వెళ్లాలి. ఇక్కడేమో బస్సులు తిప్పరంటున్నారు. ఏం చేద్దాం పిల్లోలను వేసుకుని ఉంటున్నాం. ఎవరు పట్టించుకోవడంలేదు.
 చివరి చూపు చూస్తానో లేదో - చెన్నమ్మ(అనంతపురం): మా అల్లుడు చనిపోయాడు. వాళ్లది పెనుకొండ. అక్కడకు వెళ్లాలి. ఇక్కడేమో బస్సులు రావన్నారు. చివరి చూపు చేస్తానో లేదో.

 కార్మికుల అభిప్రాయాలు...
 ప్రభుత్వమే బాధ్యత వహించాలి - భాస్కర్‌నాయుడు(ఎన్‌ఎంయూ): సమ్మె జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ప్రయాణికులు, కార్మికులు రోడ్డుపాలు కావడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కార్మిక చట్టాలను విస్మరిస్తున్నారు.
 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలి - గోపాల్(ఎన్‌ఎంయూ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందే. అందరితో ధీటుగా పనిచేస్తూ...ప్రజలకు సేవలందిస్తున్నాం. మాకే ఇవ్వకపోతే ఎలా..? డిమాండ్లు నెరవేరాకే బస్సెక్కుతాం.

 ఒక్క బస్సు తిరగనివ్వం - వైకే మూర్తి(ఎన్‌ఎంయూ): ఒక్క బస్సు బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. కార్మికులంటే అంత చుకలనా. ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి ఇవాల మాట మారుస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.
 మారిన బాబు అంటే ఇదేనా - రామిరెడ్డి(ఈయూ): నేను మారాను. అందరి కష్టాలను తీరుస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...మారడమంటే ఇదేనా.. కార్మికులతో ఆడుకుంటున్నావ్. లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా...నీకు కన్పించలేదా...ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్
 మాట తప్పడం బాబు నైజం - కొండయ్య(ఈయూ): చంద్రబాబు నాయుడుకు మాట తప్పడం అతని నైజం. కార్మికులతో ఆడుకుంటున్నారు. ఎన్నికల ముందు ఓ మాట ఇప్పుడోమాట మాట్లాడుతున్నారు. మా ఆగ్రహానికి గురికాక తప్పదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement