
బంద్‌లోనూ బస్ నడపాలని ఒత్తిడి
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
తిరుపతి క్రైం: బంద్ జరుగుతున్నా బస్సు నడపాలని, నష్టం జరిగితే మీదే బాధ్యతని అధికారులు హుకుం జారీ చేయడంతో ఆర్టీసీ డ్రైవర్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం తిరుపతి బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు మంగళవారం బంద్ కావడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉదయం 11 గంటల సమయంలో బస్సులను నడపాలని కండక్టర్లు, డ్రైవర్లను అధికారులు ఆదేశించారు. అవాంఛనీయ ఘటనల వల్ల బస్సుపై దాడి జరిగి నష్టం వాటిల్లితే తమది బాధ్యత కాదని డ్రైవర్లు, కండక్టర్లు తెలిపారు.
అధికారులు మాత్రం చిన్నపాటి అద్దం పగిలినా మీదే బాధ్యత అని, బస్సులు తీయాలని ఆదేశించారు. అసలే చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని లాక్కొస్తుంటే ఇలాంటివన్నీ తమ నెత్తిపై ఎక్కడ పడతాయోనన్న భయంతో డ్రైవర్ మునస్వామి కిరోసిన్ తెచ్చుకుని ఒంటిపై పోసుకుని అంటించుకునేందుకు ప్రయత్నించగా సహచర ఉద్యోగులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.