హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగులపై దాడి
Published Sun, Sep 8 2013 2:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు రాజమండ్రి నుంచి వెళ్లిన ఆర్టీసీ ఉద్యోగులపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో సభా ప్రాంగణానికి వెళుతున్న వారిపై జరిపిన రాళ్ల దాడిలో ముగ్గురు గాయపడగా, వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులు శుక్రవారం సాయంత్రం రాజమండ్రి బస్ కాంప్లెక్స్ నుంచి ప్రైవేట్ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లారు. ఉదయం అక్కడకు చేరుకున్నాక పోలీసుల అనుమతితో బస్సును ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉంచి కాలినడకన సభా ప్రాంగణానికి బయలుదేరారు.
వీరిలో సలాది ప్రకాష్ వికలాంగుడు కావడంతో, అతడికి సాయంగా ఆదినారాయణ, కె.సుబ్రహ్మణ్యంలను తోడుగా ఇచ్చి ఆటోలో పంపారు. ఆటో దిగిన తర్వాత లోపలికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, పక్కనున్న నిజాం హాస్టల్‌లో ఉన్న కొందరు వారిపై పెద్దఎత్తున రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో సలాది ప్రకాష్, ఆదినారాయణ, కె.సుబ్రహ్మణ్యంలకు గాయాలయ్యాయి. అక్కడున్న పోలీసులను బాధితులు నిలదీయడంతో, వారు హాస్టల్ వద్దకు వెళ్లి అక్కడున్న వారిని లోపలికి పంపించారని ప్రకాష్ తెలిపారు. ఇలాఉండగా ఆర్టీసీ ఉద్యోగులపై దాడిని ఖండిస్తూ సంస్థ జేఏసీ నాయకుడు యర్రంశెట్టి కొండలరావు ఆధ్వర్యంలో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. దాడికి నిరసనగా ఆదివారం ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
Advertisement