
'ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలి'
హైదరాబాద్:ఆర్టీసీ కార్మికులు సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని ఎండీ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు జరప తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని సూచించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఛార్జీలు పెంచగా వచ్చిన ఆదాయంలో కార్మికులకు ఫిట్ మెట్ ఇస్తామని తెలిపారు. ఫిట్ మెంట్ ఎగ్గొట్టాలనే ఆలోచన లేదని ఆయన ఈ సందర్భంగ పేర్కొన్నారు. ఫిట్ మెంట్ నిధులను ఏ విధంగా సమకూర్చుకోవాలన్న దానిపై చర్చిస్తామని సాంబశివరావు తెలిపారు.
చర్చలకు ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా సమ్మె సబబు కాదని ఆయన అన్నారు. 27 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి రూ. 820 కోట్ల భారం మోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీ మనుగడకు ప్రమాదమన్నారు. ఒకవేళ కార్మికులు సమ్మె చేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి.