బస్సులు బంద్ | strike starts in rtc from monday midnight | Sakshi
Sakshi News home page

బస్సులు బంద్

Published Tue, May 5 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

బస్సులు బంద్

బస్సులు బంద్

- నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
- 43% ఫిట్‌మెంట్ కోసం యూనియన్ల డిమాండ్
- ఎక్కడికక్కడ నిలిచిపోనున్న బస్సులు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ యాజమాన్యం
- రంగంలోకి ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లు

హైదరాబాద్:
ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. దీంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ను లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.

అయితే, బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపాల్సిందేనంటూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.  రవాణా శాఖ ఇప్పటికే కమిషనర్, వివిధ జిల్లాల ఎస్పీలకు లేఖలు రాసింది. వారికి అందుబాటులో ఉన్న ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లను ఈ మేరకు సిద్ధం చేయాలని అందులో కోరింది. గతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె చేసినప్పుడు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలా ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్ల సాయంతో బస్సులు నడిపారు. మొత్తం బస్సుల్లో దాదాపు 60 శాతం బస్సులను నడిపించగలిగారు. అయితే, ప్రమాదాలు జరుగుతాయని విమర్శలు వెల్లువెత్తినా యాజమాన్యం వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించాలని నిర్ణయించింది.

నేడు ప్రభుత్వంతో చర్చలు....
ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్టుగా 43 శాతం ఫిట్‌మెంట్ చెల్లించే స్తోమత ఆర్టీసీకి లేదని సంస్థ ఎండీ సాంబశివరావు ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఆ భారాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే తప్ప దాని అమలు సాధ్యం కాదని పేర్కొన్న ఆయన విషయాన్ని ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ, టీఆర్‌ఎస్ ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభ, ప్రజాప్రతినిధులకు శిక్షణ... ఇలా వరుస కార్యక్రమాలతో కొంతకాలంగా బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ విషయంపై దృష్టి సారించలేదు. సమ్మెకు సిద్ధమని కార్మిక సంఘాల నేతలు పదేపదే ప్రకటిస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. ఇక మంగళవారం ఒక్కరోజే గడువు ఉండడం, శిక్షణ తరగతులు ముగిసి ముఖ్యమంత్రి కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటుండడంతో నేడు చర్చలకు పిలవవచ్చని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ జేఎండీ రమణరావు ముఖ్యమంత్రిని కలసి సమ్మె విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి సానుకూల నిర్ణయం వెలువడని పక్షంలో సమ్మె తప్పదని అధికారులు నిర్ణయానికొచ్చారు.
 
అటు ఏపీలోనూ కార్మికులు సమ్మెకు వెళ్తున్నారు. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై ఎంప్లాయీస్ యూనియన్ తలపెట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు తెలియజేస్తూ సమ్మెలో పాల్గొంటామని నేషనల్ మజ్దూర్ యూనియన్  సోమ వారం విజయవాడలో ప్రకటించింది.

సాగర్‌కు వెళ్లినా దక్కని అపాయింట్‌మెంట్..
సమ్మె విషయమై చర్చించేందుకు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు నాగార్జునసాగర్‌కు వెళ్లినా సీఎం, మంత్రుల అపాయింట్‌మెంట్ దక్కలేదు. సుమారు 3 గంటల పాటు ఎదురుచూసినా వినతిపత్రం తీసుకోవడానికి కూడా ఎవరూ రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగారు. దీంతో ఇక సమ్మె విషయంలో రాజీ లేదని తేల్చిచెప్పారు. దీన్ని స్పష్టం చేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆధ్వర్యంలో బృందం సోమవారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మను కలిసి 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాల్సిందేనని, లేకుంటే సమ్మె తప్పదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో వేతనాలు సమం కావాలంటే ఫిట్‌మెంట్ 62 శాతం ప్రకటించాలని, ఆ డిమాండ్‌తో సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ ఎన్‌ఎంయూ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement