హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యంతో మంగళవారం కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనంపై యాజమాన్యం నుంచి హామీ లభించలేదు. అయితే దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. డిమాండ్ల పరిష్కారానికి సమయం కావాలని, జులై వరకూ సమ్మె వాయిదా వేసుకోవాలని యాజమాన్యం ఈ సందర్భంగా కార్మిక సంఘాలను కోరింది.
ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్టుగా 43 శాతం ఫిట్‌మెంట్ చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం 28 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే 28 శాతం ఫిట్మెంట్కు అంగీకరించేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దాంతో చర్చలు విఫలం అయ్యాయి. దాంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు.... ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారు. కార్మిక సంఘాల చర్చలపై ఆయన ఈ సందర్భంగా సీఎంకు వివరించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం రవాణామంత్రి మహేందర్ రెడ్డితో కార్మిక సంఘాలు చర్చలు జరపనున్నారు.
కాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ను లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.
చర్చలు విఫలం, వెనక్కి తగ్గేది లేదు..
Published Tue, May 5 2015 1:15 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement