
'చంద్రన్న కానుక కాదు.. సంక్రాంతి దోపిడీ'
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ పోటీగా ఆర్టీసీ దోచుకుంటోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఆర్టీసీ చార్జీలు ప్రైవేటు ట్రావెల్స్ తో పోటీ పడుతున్నాయని అన్నారు. ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులపై భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలు నియంత్రించలేకపోతున్నామని రవాణా మంత్రి చేతులు ఎత్తేయడం శోచనీయమన్నారు. 'చంద్రన్న కానుక కాదు సంక్రాంతి దోపిడీ' అని ధ్వజమెత్తారు. చంద్రన్న కానుక పేరుతో పనికిరాని వస్తువులు అంటగడుతున్నారని దుయ్యబట్టారు. రిటైల్ రంగంలో పెట్టుబడులకు చంద్రబాబు బార్లా తలుపులు తెరవడం దారుణమన్నారు. రిటైల్ రంగంపై పెట్టుబడులకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.