=టికెట్ ధరల పెంపు
=కొన్ని రకాల బస్‌పాస్‌లపైనా భారం
=టోల్ బాదుడు, సెస్‌చార్జీలు యథాతథం
=పల్లె వెలుగుపై కాస్త కనికరం
=రీజియన్లో నెలకు రూ.2 కోట్ల భారం
సాక్షి, విశాఖపట్నం : ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. బుధవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. విశాఖ రీజియన్ (సిటీ/రూరల్) పరిధిలో 1064 బస్సులున్నాయి. రూరల్‌లో 352 సర్వీసుల ద్వారా రోజుకు రూ.70 లక్షల ఆదాయం వస్తోంది. పెరిగిన చార్జీలతో ప్రయాణికులపై నెలకు రూ.2 కోట్ల భారం పడుతుంది. ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్నవాళ్లపై భారం పడదని అధికారులు తెలిపారు.
కొన్ని బస్‌పాస్‌లపైనా భారం మోపింది. మొత్తమ్మీద 10 శాతం చార్జీలు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. పల్లె వెలుగులో 35 కి.మీ దాటితే రూ.1 పెరగ్గా, సిటీ బస్సు టికెట్లు కూడా రూ.1కి తక్కువ లేకుండా పెరగబోతున్నాయ్. ప్రయాణికుల నుంచి బస్టాండ్లు, కాంప్లెక్సుల్లో అభివృద్ధి చార్జీల పేరిట ప్రస్తుతం వసూలు చేస్తున్న సెస్ రూ.1 తోపాటు టోల్‌గేట్ల వసూల్లో మార్పేమీ లేదని డిప్యూటీ సీటీఎం (రూరల్) పబ్బా జీవన్ ప్రసాద్ తెలిపారు.
స్టేజీల పరిస్థితి ఇదీ : 14 కి.మీల పరిధిలో ఏడు స్టేజీల వరకు రూ.1 పెరగనుంది. 14 కి.మీ నుంచి 40 కి.మీ వరకు రూ.2 పెంచనున్నారు. సిటీ మెట్రోపై ప్రతి స్టేజీకి రూ.1 వడ్డన పడనుంది. కనీస టికెట్ రూ.6 నుంచి రూ.7కి పెరగనుంది. సిటీ పరిధిలోని తొమ్మిది డిపోల పరిధిలో సుమారు 400 సర్వీసులున్నాయి. బస్‌పాస్‌లపైనా భారం పడనుంది.
విద్యార్థుల పాస్‌లపై దృష్టి సారించినప్పటికీ ఆర్డినరీ పాస్ తీసుకుని ఎక్స్‌ప్రెస్/మెట్రో బస్సులెక్కేవారిపై (కాంబి టికెట్) ఇప్పుడున్న రూ.5 అదనపు ధర రూ.10కి పెరగనుంది. జనరల్ బస్ టికెట్ (జీబీటీ) పాస్ రూ.650ది ఇకపై రూ.700కానుంది. మెట్రో పాస్ రూ.750ది ఇకపై రూ.800 కానుంది. సిటీ బసుల్లో పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ గతంలో రూ.60 ఉండగా ఇప్పుడది రూ.70 అవుతుంది. ఎన్‌జీవో పాస్‌లు గతంలో రూ.220 ఉండగా ఇప్పుడు రూ.235, మెట్రోల్లో రూ.320ది కాస్త రూ. 335కానుంది.
ఇదీ పరిస్థితి
పల్లెవెలుగుకు 35కి.మీ వరకు రూపాయి పెరగ్గా 36నుంచి 55కి.మీ వరకు రూ.2పెరిగింది. 56నుంచి 75కి.మీ వరకు రూ.3పెరిగింది. 76నుంచి 115కి.మీ వరకు రూ.4పెరిగింది. ఎక్స్‌ప్రెస్‌ల్లో కనీస టికెట్ ధర రూ.10, డీలక్స్‌లో రూ.15, ఇంద్రలో రూ.25, గరుడ రూ.25, గరుడ ప్లస్‌లో రూ.25లో ఎలాంటి మార్పులేదు. ఎక్స్‌ప్రెస్‌లో ఇదివరకు ఉన్న రూ.72టిక్కెట్ ధర ఇక నుంచి రూ.79కి పెరగనుంది. డీలక్స్‌లో రూ.80 ధర 89వరకు పెరగనుంది. సూపర్‌లగ్జరీలో రూ.94 ఉన్న ధర ఇకపై రూ.105కానుంది. ఇంద్రలో రూ.120 ధర రూ.132కానుంది. గరుడ రూ.140ది రూ.155కానుంది. గరుడ ప్లస్ రూ.150ది రూ.165 కానుంది.