- టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారంతా ద్రోహులే
- ఆనం వివేకానందరెడ్డి
నెల్లూరు (విద్యుత్) : రోడ్ల విస్తరణ పేరుతో నెల్లూరు నగరాన్ని శిథిలం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక ఏసీ సెంటర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనం మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రజలు, మేధావులు, వ్యాపారులతో చర్చించకుండా రోడ్ల విస్తరణ పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు.
కార్పొరేషన్ అధికారులు కొలతలు చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ అప్రజాస్వామిక చర్యను అడ్డుకునేందుకు ఈ నెల 6న హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. విస్తరణకు ముందస్తు నోటీసులు, గృహస్తులు, వ్యాపారులకు వారు కోరిన మార్కెట్ విలువలను కచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉందన్నారు. పరిహారం చెల్లించే విధానంలో వ్యాపార విభాగాలకు మూడు రెట్ల మార్కెట్ విలువను అందించాలని చట్టం సూచిస్తుందన్నారు.
‘ప్రజల్లో నుంచి వచ్చాం కాబట్టి మా కుటుంబానికి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. కోట్లు గడించే కార్పొరేట్ అధినేతలకు ప్రజా సమస్యలు ఏం అర్థమవుతాయి’ అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. నగర కార్పొరేటర్లకు, కార్పొరేషన్ అధికారులకు మధ్య తీరని అగాధం ఉందన్నారు. ముందు కింది స్థాయి నుంచి సమావేశాలు నిర్వహించి, కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథంలో సాగాలే తప్ప మోనార్క్‌లాగా వ్యవహరించడం తగదని ఆయన కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్ బాబుకు చురకలంటించారు.
నమ్మక ద్రోహులు
పార్టీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందాక టీడీపీలోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ద్రోహులేనంటూ ఆనం మండిపడ్డారు. కాంగ్రెస్ పునాదులపై ఈ స్థాయికి వచ్చి నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అంటే తల్లి పాలు తాగి, రొమ్ము గుద్దిన* చందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో వీరంతా పరస్పరం ద్రోహం చేసుకుంటారనడంలో సందేహం లేదన్నారు. సమావేశంలో నగర ఇన్‌చార్జ్ ఏసీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, బర్నా బాస్ తదితరులు పాల్గొన్నారు.