మండలంలోని బాసంగి నిర్వాసితులకు సీమనాయుడువలసలో పునరావాసం కల్పించేందుకు రూ. 3.80 కోట్లు కేటాయించారు.
బాసంగి పునరావాస గ్రామంలో రూ. 3.80కోట్లతో పనులు
నిర్వాసిత సంఘాలకివ్వకుండా వేరేవారికి పనులు అప్పగింత
టెండర్లతో ప్రమేయం లేకుండా అధికారుల వడ్డన
పనుల్ని అడ్డుకున్న నిర్వాసితులకు పోలీసులతో హెచ్చరికలు
పనులు ఎవరిపేరున జరుగుతున్నాయో తేల్చని అధికారులు
జియ్యమ్మవలస : మండలంలోని బాసంగి నిర్వాసితులకు సీమనాయుడువలసలో పునరావాసం కల్పించేందుకు రూ. 3.80 కోట్లు కేటాయించారు. వీటితో సిమెంటురోడ్లు, విద్యుత్, కాలువలు, తాగునీరు, అంగన్‌వాడీ, పాఠశాలల నిర్మాణం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. వీటిని నిబంధనల ప్రకారం నిర్వాసిత గ్రామంలోని సంఘాలకే అప్పగించాలి. వారిచేతనే పనులు చేయించాలి. కానీ అధికార పార్టీకి చెందిన ఓ మండలస్థాయినాయకుడి కుటుంబ సభ్యుల పేరుతో పనులు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం ఆ పనులు శాఖాపరంగానే చేపడుతున్నామని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకూ అక్కడి పనులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. డీఈని ప్రశ్నిస్తే దాటవేస్తుంటే... ఐటీడీఏ ఈఈని ప్రశ్నిస్తే డీఈని అడగాలని చెబుతున్నారు.
అసలు ఏం జరుగుతోంది?
ఇక్కడ రూ. 3.80కోట్ల విలువగల పనులు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం టెండర్ పిలవాల్సి ఉన్నా రూ. పదేసి లక్షల విలువగలవిగా ముక్కలు చేసి, నామినేషన్ పద్ధతిలో పనులు చేపడుతున్నారు. అదీ నిర్వాసితుల్లోని మహిళా సంఘాలకు, గ్రామ గిరిజన అభివృద్ధి సంఘానికి(వీటీడీఏ) అప్పగించాల్సి ఉన్నా ఇవ్వకుండా... అధికార పార్టీకి చెందిన మండల నాయకుడి తల్లిని పునరావాస గ్రామంతో సంబంధం లేని ఓ సంఘంలో సభ్యురాలిగా చేర్పించి పనులు కట్టబెట్టారు. పనుల్ని నిర్వాసిత గ్రామ ప్రజలు అడ్డుకుంటున్నా పోలీసులను తెచ్చి పనులు జరిపిస్తున్నారే తప్ప తమ గోడు వినడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.