
నెల్లూరు మినిబైపాస్‌లో డివైడర్ మద్య ఏర్పాటు చేసిన లాలీపాప్స్ (చిన్న హోర్డింగ్స్)
ప్రచార హోర్డింగ్‌ల ద్వారా ఏటా పెద్ద మొత్తంలో ఆదాయం ఆర్జిస్తున్నా.. నగరపాలక సంస్థకు కట్టేది మాత్రం రూ.వేలల్లోనే. నెల్లూరు కార్పొరేషన్‌కు కాసుల వర్షం కురిపించాల్సిన హోర్డింగ్‌లు అధికారుల మామూళ్ల కక్కుర్తితో ఖజానాకు భారీగా తూట్లు పడుతోంది. ప్రజలపై వివిధ రకాల పన్నులతో భారం మోపే అధికారగణం హోర్డింగ్ నిర్వహణ ఏజెన్సీలపై ప్రేమ కురిపిస్తుస్తోంది.. ఏటా నిర్ణయించిన టార్గెట్‌లో కేవలం పది శాతం మాత్రమే వసూలు చేస్తూ చేతులు దులిపేసుకుంటోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తున్నా కార్పొరేషన్ పాలకులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఆర్థికంగా నష్టపోతున్నా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 900 హోర్డింగ్‌లు, రోడ్ డివైడర్ మధ్యలో ఉన్న లాలీపాప్స్(చిన్న హోర్డింగ్స్) దాదాపు 300 వరకు ఉన్నాయి. ఆయా ప్రచార హోర్డింగ్‌లను నగరంలోని 20 ఏజెన్సీలకు నగరపాలక సంస్థ అప్పగించింది. హోర్డింగ్‌లు, సైన్‌బోర్డుల ద్వారా నిర్వహణ సంస్థల నుంచి దాదాపు రూ.3 కోట్ల మేర çపన్నుల రూపంలో వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2002 సవరణ గెజిట్ లెక్కల ప్రకారం పన్నులనుసైతం ఖరారు చేశారు.
ఏటా రూ.3 కోట్ల వరకు వసూళ్లు చేయాల్సి ఉన్నా నగర పాలక సంస్థ అధికారులు మాత్రం ఏజెన్సీ నిర్వాహకులతో కుమ్మక్కై నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 10 శాతం కూడా వసూళ్లు చేయడం లేదు. కేవలం రూ.36 లక్షలు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా కార్పొరేషన్ ఖజానాకు దాదాపు రూ.2.7 కోట్లు వరకు గండి పడుతున్నా పాలకులు, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
గ్లోషైన్ బోర్డులు విషయంలో కూడా..
నగరంలో 25 వేల దుకాణాలు ఉన్నాయి. అందులో 22 వేల దుకాణాదారులు గ్లోషైన్(లైట్‌తో కూడిన) బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయా బోర్డులకు 2.5 చదరపు మీటర్ బోర్డుకు రూ.1000 వంతున వసూలు చేయాల్సి ఉంది. ఇలా 22 వేల దుకాణాల వద్ద దాదాపు ఏడాదికి రూ.కోటికి పైగా పన్నులు వసూలు చేయాల్సి ఉంది. కానీ నగరపాలక సంస్థ అధికారులు మాత్రం వసూలు చేయడం లేదు. దుకాణాదారుల వద్ద నెలవారీ మామూళ్లతో వసూళ్లు నిలిపివేసి కార్పొరేషన్‌కు ఆర్థిక నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
లాలీపాప్స్ తొలగించాలని ఆదేశాలున్నా..
రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న లాలీపాప్స్(చిన్న హోర్డింగ్స్)తొలగించాలని గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చినా ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం వాటిని తొలగించడం లేదు. డివైడర్ మధ్యలో ఉన్న వీటి కారణంగా వాహనం నడిపే డ్రైవర్ ప్రచార ప్రకటనలు చూసి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని తొలగించాలని ఆదేశాలున్నా ఏజెన్సీల పలుకుబడితో వాటిని తొలగించకుండా ప్రచారానికి వాడుకుంటున్నారు.
పన్నుల పెంచినా...
నగర పాలక సంస్థ ఏటా నగర వాసులపై పన్నుల భారం పెంచే అధికారులు మాత్రం ప్రచార హోర్డింగ్ విషయంలో మాత్రం 2002 గెజిట్‌లో పొందుపరిచిన పన్నును మాత్రం వసూళ్లు చేస్తోంది. ఏజెన్సీ నిర్వాహకులు రాజకీయ పలుకుబడి ఉండడంతో పాటు అధికారులకు నెలవారీ మామూళ్లు సమర్పించుకుంటుండడంతో పన్నులు పెంచే ఆలోచన చేయడం లేదు. దీంతో నగర పాలక సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
టీడీపీ కీలక నేత కనుసన్నల్లో..
నగరపాలక సంస్థ ప్రచార హోర్డింగ్ విషయంలో టీడీపీకి చెందిన కీలక నేత కనుసన్నల్లో వ్యవహారం నడిప్తసున్నారు. 20 ఏజెన్సీల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనకున్న రాజకీయ పలుకుబడితో పనులన్నీ చక్కబెడుతున్నారు. దీంతో పాలక వర్గం గానీ, అధికారులు గానీ ప్రచార హోర్డింగ్‌ల విషయంలో ఎవరూ తలదూర్చేందుకు ముందుకు రావడంలేదు. నగరంలో ఏర్పాటు చేస్తున్న పార్కుల నిర్మాణాలకు కూడా హోర్డింగ్‌లతో ఇబ్బంది కలుగుతోంది. అన్నమయ్య సర్కిల్ వద్ద పార్కు ఏర్పాటు విషయంలో అడ్డుగా ఉన్న హోర్డింగ్‌లను తొలగించేందుకు ప్రయత్నాలు చేసినా అ ఏజెన్సీ నిర్వాహకుడి పలుకుబడితో అధికారుల ప్రయత్నాలు విరమించుకోవాల్సి వచ్చింది. అక్కడ హోర్డింగ్‌ల తొలగించకపోవడంతో దాదాపు 10 అడుగుల స్థలం పూర్తిగా కజ్జాకు గురై పార్కుకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment