టీఏసీని ఏర్పాటు చేయని ప్రభుత్వం
బాక్సైట్ గనుల తవ్వకాలకు ప్రభుత్వ కుట్ర
వైస్సార్ కాంగ్రెస్‌కు భయపడే అడ్డగోలు నిర్ణయం
మండిపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు
రాజ్యాంగ హక్కుల కోసం ఉద్యమానికి సన్నద్ధం
బాక్సైట్ గనులను తమ అస్మదీయ విదేశీ సంస్థలకు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు అన్నింటినీ తుంగలో తొక్కేసింది. గిరిజన ప్రాంతల రక్షణ, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన ‘గిరిజన సలహా మండలి(టీఏసీ)తో నిమిత్తం లేకుండా బాక్సైట్ గనుల తవ్వకాలకు జీవో జారీ చేసేసింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే సభ్యులుగా ఉండనుండటంతో ఏకంగా టీఏసీనే ఏర్పాటు చేయకుండా పనికానిచ్చేసింది. రాజ్యాంగ రక్షణ ఛత్రాన్ని ఛిద్రం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు ఉద్యమానికి ఉద్యుక్తమవుతున్నారు.
- సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో టీఏసీ గురించి స్పష్టంగా నిర్దేశించింది. గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు టీఏసీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. టీఏసీ ఆమోదంతోనే గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలిన స్పష్టం చేసింది. ఏజెన్సీలో బాక్సైట్ గనులను 1960లోనే గుర్తించారు. కాగా 1986లో నాటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బాక్సైట్ గనుల తవ్వకాల ప్రతిపాదన తొలిసారి తెరపైకి వచ్చింది. నాటి నుంచి కూడా టీఏసీ సభ్యులు బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తునే ఉన్నారు. 2000-2002లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల కోసం దుబాయికి చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ టీఏసీ ఆమోదం సాధించడం సులువు కాదని గ్రహించి 2004 ఎన్నికల తరువాత చూద్దామని వాయిదా వేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈసారి ఏకంగా టీఏసీని నీరుగార్చేస్తూ అడ్డగోలుగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్‌కు భయపడే...
రాజ్యాంగం ప్రకారం గిరిజన ప్రాంతాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు టీఏసీలో సభ్యులుగా ఉండాలి. 2014 ఎన్నికల్లో రాష్ట్రం లో 8 ఎస్టీ నియోజకవర్గాల్లో ఏకంగా 7 ని యోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గిరిజన ప్రాం తాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సా ర్ కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా గెలిచా రు. ఈ నేపథ్యంలో టీఏసీని నియమిస్తే అందులో 90శాతంమంది సభ్యులు వైఎస్సా ర్ కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులే ఉంటారు. వైఎస్సార్‌కాంగ్రెస్ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తుండటంతో టీఏసీ ఆమోదం పొందడం దుర్లభమని చంద్రబాబు ప్రభుత్వ గుర్తించింది. ఒకానొక దశలో తమ పార్టీ గిరిజన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి టీఏసీలో సభ్యులుగా చేర్చాలని వ్యూహం పన్నింది. అది అంతగా ఆచరణ సాధ్యంకాదని గ్రహించి ఏకంగా టీఏసీని నియమించకూడదని నిర్ణయించుకుంది. టీఏసీ ఏర్పాటు చేయకుండానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేసేసింది. అంటే గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వ్యవస్థ టీఏసీని నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా నిర్ణయం తీసుకుంది.
ఉద్యమానికి గిరిజన ప్రజాప్రతినిధుల ఉద్యుక్తం
ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారంపై గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. గిరిజన ప్రాంతాలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ వ్యవస్థ టీఏసీని నియమించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనకు ఉద్యుక్తమవుతున్నారు. అందుకోసం గిరిజన ప్రజాప్రతినిధులు విశాఖపట్నంలో ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. తామే అనధికారికంగా టీఏసీగా ఏర్పడి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానించి గవర్నర్, రాష్ట్రపతులకు నివేదించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అధికారికంగ టీఏసీని నియమించనందున తమ ప్రాంత హక్కుల కోసం తామే టీఏసీగా ఏర్పడినట్లు ఆ నివేదికలో పొందుపరుస్తామని ఆ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిఏకంగా గిరిజనులను చైతన్యపరచడంతోపాటు ప్రభుత్వంపై న్యాయపోరాటానికి కూడా ఉద్యుక్తమవుతున్నారు.
రాజ్యాంగ రక్షణ ఛత్రం ఛిద్రం
Published Fri, Nov 13 2015 11:12 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement