త్యాగాలు స్ఫూర్తిదాయకం
రిపబ్లిక్‌డే వేడుకల్లో కలెక్టర్ కేవీ రమణ
కడప సెవెన్‌రోడ్స్ : దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. సోమవారం పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పెరేడ్‌ను సందర్శించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సందేశం వినిపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. వినూత్న పథకాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కోవలో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిందన్నారు. మొదటి విడతగా జిల్లాలో 50 వేలరూపాయలలోపు ఉన్న 2,78,067 మంది రైతులకు రూ. 315.86 కోట్ల రుణాన్ని మాఫీ చేశామన్నారు. 50 వేలకు మించి ఉన్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్, రబీల్లో సాగు శాతం తగ్గిందన్నారు. ప్రభుత్వం 48 మండలాలను కరువు కింద ప్రకటించిందని పేర్కొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు రూ.
8.87 కోట్లు మంజూరయ్యాయన్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ ద్వారా వరి పంట, పప్పు ధాన్యాల ఉత్పాదకతను పెంచడానికి రైతులకు రాయితీలు ఇచ్చామన్నారు. జిల్లాలోని తెలుగుగంగ, గాలేరు-నగరి, సీబీఆర్, గండికోట ఎత్తిపోతలు, సీబీఆర్ కుడికాలువ, పీబీసీ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైలవరం రిజర్వాయర్ ఆధునీకరణ, మైక్రో ఇరిగేషన్ పథకాల అమలుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతి, సాధికారత కోసం రుణాలు అందిస్తున్నామన్నారు. బంగారుతల్లి పథకం కింద 11,387 మంది శిశువులు నమోదు కాగా, వారిలో 5517 మందికి మొదటి విడతగా రూ.2500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
ఇసుకను వినియోగదారులకు చేరువలో ఉంచేందుకు త్వరలో కొత్త రీచ్‌లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ వృత్తుల్లో శిక్షణలు అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతినెల 25.36 కోట్లు పింఛన్ల కింద అందిస్తున్నామని చెప్పారు. దీపం పథకం కింద 14697 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఉపాధి హామీ ద్వారా పనులు కల్పిస్తున్నామన్నారు.
నిర్మల్ భారత్ అభియాన్ కింద 49,977 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం పరిపాలన ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మాతా శిశు మరణాలను అరికట్టడానికి ‘అన్న అమృతహస్తం’ ద్వారా గర్బిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఒకపూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. తీవ్ర లోప పోషణతో ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టి కాహారాన్ని అందజేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకంలో మరో వంద వ్యాధులకు చికిత్స చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు.
గ్రామీణ నీటి సరఫరా పథకం కింద రూ. 186 కోట్లు మంజూరయ్యాయని, పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాంకేతిక, వాణిజ్య అనుకూలతల పరిశీలనకు సెయిల్ బృందం వచ్చి వెళ్లిందన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా రూ. 20 వేల కోట్లతో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
మెగా ఫుడ్‌పార్కు, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కు, పండ్లు, కూరగాయల టెర్మినల్‌మార్కెట్, టెక్స్‌టైల్స్ పార్కు, అపెరల్ ఎక్స్‌పోర్టు పార్కు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. కడప నగర తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సోమశిల బ్యాక్ వాటర్ పథకం కోసం రూ. 428 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు వెల్లడించారు. బాలబాలికల నిష్పత్తిలో జిల్లా అట్టడుగు స్థానంలో ఉందన్నారు.
బాలికల నిష్పత్తిని పెంచడం కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నవీన్‌గులాఠీ, జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు, ఇన్‌ఛార్జి ఏజేసీ సుబ్బారెడ్డి, ఇన్‌ఛార్జి డీఆర్వో ఈశ్వరయ్య, ఇతర ఉన్నతాధికారులు పాలొన్నారు. రిపబ్లిక్‌డే సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను కలెక్టర్ సత్కరించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పెరేడ్ గ్రౌండ్స్‌లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఆస్తుల పంపిణీ
డీఆర్‌డీఏ, మెప్మా, ఏపీఎంఐపీ, ఏపీ వికలాంగుల సహకార సంస్థల ద్వారా 16,747 మంది లబ్దిదారులకు రూ. 3073 లక్షల విలువజేసే 5470 యూనిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు.