జిల్లా పురోగతికి కృషిచేద్దాం | District development krsiceddam | Sakshi
Sakshi News home page

జిల్లా పురోగతికి కృషిచేద్దాం

Published Tue, Jan 27 2015 3:31 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

జిల్లా పురోగతికి కృషిచేద్దాం - Sakshi

జిల్లా పురోగతికి కృషిచేద్దాం

పాలమూరు : పాలమూరు జిల్లా అన్నిరంగాల్లో పురోగతి సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని, ప్రభుత్వపరంగా అందించే సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా అన్ని విభాగాలు దృష్టి నిలపాలని కలెక్టర్ టీకే శ్రీదేవి పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆమె జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే ద్వారా జిల్లాలో దాదాపు 10లక్షల కుటుంబాల వివరాలను సేకరించి కంప్యూటరీకరణ చేశామన్నారు.

ఈ సర్వే ఆధారంగా ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతుల ఆధారంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రూ. 57.48 కోట్లతో 792 సింగిల్ విలేజ్ స్కీములను చేపట్టామని.. వాటిలో 341 పనులు పూర్తి చేశామన్నారు. తె లంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని ప్రతి మనిషికి గ్రామీణ ప్రాంతాల్లో రోజు కు 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున తాగునీరు అందించేందుకు, అలాగే పారిశ్రామిక ప్రాంతాలకు నీరందించేందుకు రూ.8,558 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయిం చామన్నారు.

జిల్లాలో నిరుపయోగంగా ఉన్న భూములు సాగులోకి తెచ్చేందుకు మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలను చేపడుతున్నామని చెప్పారు. చిన్న నీటి పారుదల శాఖ ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ పథకం కింద 54 చెరువు పనులకు రూ.2,994 లక్షలను మంజూరు చేయగా 44 పనులు పూర్తిచేశామని చెప్పారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలో 339 చెరువుల పనులు చేపట్టేందుకు రూ. 10,256 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు.

మూడేళ్లలో సంభవించిన వివిధ ప్రకృతి వైపరీత్యాలకు రైతులకు రూ.100 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైందని.. ఈ ఏడాది ఆరు లక్షల మంది రైతులకు రూ. 2,726 కోట్ల పంట రుణాలు మాఫీ చేశామని చెప్పారు. ఇప్పటివరకు 4.55లక్షల మంది రైతులకు రూ. 1,917 కోట్లు పంట రుణాల మంజూరు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల సరఫరా కోసం రూ.21.70 కోట్లు, జాతీయ ఆహారభద్రత మిష న్ కింద రూ.1,390 లక్షలు జిల్లాకు కేటాయిం చినట్టు చెప్పారు.

ఉద్యాన వన శాఖ ద్వారా 1,950 హెక్టార్లలో రూ.37 లక్షల వ్యయంతో 1,445 మంది రైతులకు షెడ్‌నెట్‌హౌస్, గ్రీన్‌హౌస్, వర్మీ కంపోస్ట్, ప్యాక్‌హౌస్ కొరకు ఆర్థిక సహాయం అందించామన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, మన ఊరు-మన కూరగాయ లు పథకాల ద్వారా 50శాతం రాయితీతో 34,795 హెక్టార్లలో రూ.93 లక్షల వ్యయంతో కూరగాయల సాగు చేస్తున్నారని చెప్పారు. ‘సునందిని’ పథకం ద్వారా రూ.130 లక్షల సబ్సిడీతో 3,243 ఆవుదూడలకు ఆరోగ్య సంరక్షణ అందించినట్టు వివరించారు.
 
రూ. 87 కోట్లతో మైక్రో ఇరిగేషన్ పథకం
రూ. 87 కోట్లతో 12,400 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పథకం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 75శాతం రాయితీపై స్ప్రింక్లర్లు అంది స్తున్నామన్నారు. విద్యుత్ శాఖ ద్వారా 1,353 కాలనీలను విద్యుదీకరించేందుకు రూ. 74 కోట్ల ఖర్చుతో ఆర్‌జీ జీవై స్కీంకింద ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 258 ఎస్సీ కాలనీల విద్యుదీకరణకు రూ. 3కోట్లు మంజూరు కాగా.. 154 కాలనీల్లో పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది రూ. 53 కోట్లతో 10,667 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. గట్టు మండలంలో 5వేల ఎకరాల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించామన్నారు.
 
మన ఊరు.. మన పథకంలో 10,174 పనుల గుర్తింపు
మన ఊరు- మన ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 64 మండలాలు, 1,331 పంచాయతీలలో  రూ. 7,204 కోట్ల విలువైన 10,174 పనులు గుర్తించినట్టు చెప్పారు. అదేవిధంగా 13వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లా పరిషత్ సెక్టార్‌కు రూ. 2,794 లక్షలు, మండల సెక్టారుకు రూ.1,067 లక్షలు మంజూరయ్యాయన్నారు.
 
వరద బాధితులకు 4,960గృహాల నిర్మాణం పూర్తి
2009లో నష్టపోయిన వరద బాధితులకు 8,260గృహాలు మంజూరు చేసి 4,960 గృహా లను రూ. 43 కోట్లతో మంజూరు పూర్తిచేసినట్టు చెప్పారు. జిల్లా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చెంచులకు 1,048 గృహాలు, జోగినీలకు 918 గృహాలను పూర్తి సబ్సిడీతో ఇందిరా ఆవాస యోజన పథకం ద్వారా మంజూరు చేశామన్నారు. ఆహారభద్రత పథకం ద్వారా జిల్లాలో 10.17 లక్షల కుటుంబాలకు వారి కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కిలో రూ. 1కే బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.

జిల్లాలోని అన్ని వసతిగృహాలకు, 3,837 పాఠశాలల్లోని సుమారు 5.11లక్షలమంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 25 ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు మంజూరైనట్టు చెప్పారు. జననీ సురక్ష యోజన కింద దారిద్య్రరేఖకు దిగువనున్న 5,763 మంది గర్భిణీలకు, జననీ శిశు రక్ష కార్యక్రమం కింద 1,332 మంది శిశువులకు లబ్ధి చేకూర్చినట్టు చెప్పారు.

అమ్రాబాద్‌లో సివిల్ ఆసుపత్రి, గద్వాలలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఈ ఏడాది జిల్లాలో 7ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు రూ. 21 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను 675 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 6518 లక్షలు, 615 మరుగుదొడ్లకు రూ. 461 లక్షలు, తాగునీటికి రూ. 13 లక్షలు, వివిధ మరమ్మతుల కొరకు రూ. 65 లక్షలు, రెండు నూతన ప్రాథమిక పాఠశాల భవనాల నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరయ్యాయన్నారు.
 
ఇందిర జలప్రభ ద్వారా 91వేల ఎకరాల భూమి అభివృద్ధి
ఇందిర జలప్రభ పథకం ద్వారా 91వేల ఎకరాల భూమిని రూ. 146 కోట్లతో అభివృద్ధి చేసి 47,475 మంది లబ్ధిదారులకు సహాయం అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు. డబ్ల్యూఎంపీ పథకం కింద 102 మెగావాటర్ షెడ్ల ద్వారా 4.07 లక్షల హెక్టార్ల భూమిని అభివృద్ధి చేయడానికి రూ. 500 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు.

డీఆర్‌డీఏ ద్వారా ఈ ఏడాది 25,100 స్వయం సహాయక సంఘాల్లో ఇప్పటి వరకు 9,122 సంఘాలకు రూ. 251 కోట్లు, స్త్రీ నిధి పథకం ద్వారా 4,385 గ్రూపులకు రూ. 21కోట్ల రుణ సదుపాయం కల్పించామన్నారు.


ఐకేపీ ద్వారా 1,189 పట్టణ మహిళా సంఘాలకు రూ. 40కోట్ల ఆర్థిక సహాయం అందించామన్నారు. పింఛన్ల కోసం ఇప్పటి వరకు 3,85,000 మందికి రూ. 42 కోట్లు చెల్లించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో రెండు మెగా పరిశ్రమలు రూ. 1,400 కోట్ల పెట్టుబడితో స్థాపించి 2,350 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదనలు తీసుకున్నామన్నారు.

 చేనేత పరపతి కార్డు పథకం కింద 2725 మంది చేనేత కార్మికులకు రుణసౌకర్యం కల్పించాలని నిర్ణయించచామన్నారు. ‘కల్యాణ లక్ష్మి పథకం’ కింద పేద దళిత ఆడపిల్లల పెళ్లికి రూ. 51వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 28 మందికి, ‘షాదీ ముబారక్ పథకం’ కింద పెళ్లికాని పేద ముస్లింలు, క్రిష్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఫారసీ బాలికలకు రూ. 51వేల చొప్పున 30మందికి ఆర్థిక సాయం అందించామన్నారు.

ఎస్టీ సబ్‌ప్లాన్ కింద గిరిజన సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి, 9గిరిజన యూత్ ట్రైనింగ్ సెంటర్ల నిర్మాణానికి, 5చోట్ల కళాశాల హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో డార్మిటరీల నిర్మాణానికి రూ. 26.30 కోట్లు మంజూరయ్యాయన్నారు. బీసీ వసతిగృహాల ఆధునికీకరణకు రూ. 1.73కోట్లు ఖర్చు చేశామని..42,468మంది వికలాంగులకు నెల కు రూ.1,500 చొప్పున పింఛన్ మంజూరు చేశామన్నారు. భూమిలేని నిరుపేద దళిత కుటుం బాలకు 60 ఎకరాల భూమిని రూ. 156 లక్షలతో కొనుగోలు చేసి 20మందికి పంపిణీ చేశామన్నారు.

ప్రతి మండలకేంద్రంలో మినీ స్టేడి యం నిర్మించేందుకు ఏడెకరాల భూమిని సేకరి స్తున్నామన్నారు. హరితహారం కింద భాగంగా జిల్లాలో 6.20 కోట్ల మొక్కలు పెంచి, రానున్న మూడేళ్లలో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కలెక్టర్ శ్రీదేవి వివరించారు. అనంతరం వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ విశ్వప్రసాద్, ఇన్‌చార్జ్ జేసీ రాజారాం, డీఆర్వో ఎం.రాంకిషన్, ఏఎస్పీ మల్లారెడ్డి, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement