కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ శశిధర్ పిలుపునిచ్చారు. గురువారం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో 67వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ పోలీస్ పెరేడ్‌ను తిలకించారు. గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల 13శాతం మాత్రమే పంటలు సాగయ్యాయని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద 44వేల హెక్టార్ల వర్షాధార భూముల్లో పంటల సాగుకు 5,800 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో 20,555 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రబీలో విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోందని తెలిపారు.
గత ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం 52కోట్ల 61లక్షలు మంజూరు చేయగా, 16కోట్ల 21లక్షల రూపాయలను 21,565 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు 5కోట్ల 46లక్షల రూపాయలు మంజూరైందని వెల్లడించారు. జలయజ్ఞం క్రింద జరుగుతున్న ప్రాజెక్టులను వీలైనంత త్వరలో పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం 5లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తోందన్నారు.
అసలు కడితే వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు 482కోట్ల 98లక్షలు రుణాలు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా 111కోట్ల 44లక్షలు రుణాలు ఇచ్చామన్నారు. రాజీవ్ యువకిరణాలు క్రింద ఈ ఆర్థిక సంవత్సరంలో 9,276 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. బంగారు తల్లికి చట్టబద్దత ప్రభుత్వం కల్పించిందని, మే 1వ తేది నుంచి పుట్టిన ఆడపిల్లలకు 21 సంవత్సరాలు వచ్చేవరకు ప్రభుత్వం దశలవారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1747 మంది ఆడ శిశువులను నమోదు చేశామని పేర్కొన్నారు. పేదలకు ఆహార భద్రత కోసం చౌకదుకాణాల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నామన్నారు. అమ్మహస్తం, దీపం పథకం, ఇందిరమ్మ ఇల్లు ద్వారా లబ్ధిచేకూరుస్తున్నామన్నారు. నిర్మల్ భారత్ అభియాన్‌క్రింద జిల్లాలో 45,537 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆమోదం లభించిందని తెలిపారు.
జిల్లాలో 648 మంది భూమి లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఇందిరమ్మ పచ్చతోరణం క్రింద జీవనభృతి కల్పించేందుకు 1,24,530 మొక్కలు నాటించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఏడాది 2124 మంది రైతులకు చెందిన 5,725 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం మూడేళ్లకుగానూ 21కోట్ల 24లక్షలు ఖర్చు చేయనున్నామన్నారు. జిల్లాలో 7వ విడతలో 10,057 మంది లబ్ధిదారులకు 16,797 ఎకరాల భూములను పంపిణీ చేసేందుకు గుర్తించామన్నారు. వచ్చే ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ప్రథమస్థానం పొందేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
సమరయోధుల కుటుంబాలకు సన్మానం :
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను కలెక్టర్ ఈ సందర్భంగా సత్కరించారు. దివంగత సమరయోధులు సుబ్బన్న సతీమణి నారాయణమ్మ, టేకూరి సుబ్బారావు సతీమణి సరస్వతి, ఫక్కీరప్ప సతీమణి దస్తగిరమ్మలతోపాటు సైలాస్‌ను కూడా సత్కరించారు.
శకటాల ప్రదర్శన :
గ్రామీణ నీటి సరఫరా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ యువకిరణాలు, 108, రాజీవ్ విద్యామిషన్, శ్రమశక్తి సంఘం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మున్సిపల్‌కార్పొరేషన్‌లు తమ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించారు.
ఆస్తుల పంపిణీ :
మెప్మా, డీఆర్‌డీఎ, డ్వామా, వ్యవసాయ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, వికలాంగుల కార్పొరేషన్‌ల ద్వారా 4299.472 లక్షల రూపాయల విలువ చేసే 38,740 యూనిట్లను 50111 లబ్ధిదారులకు కలెక్టర్ పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మెరిట్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఆకట్టుకున్న సాంసృ్కతిక కార్యక్రమాలు :
నగరానికి చెందిన మాంట్‌ఫోర్ట్ హైస్కూల్, మహర్షి హైస్కూల్, ఆర్తీ ఇంగ్లీష్‌మీడియం స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, కనక మహాలక్ష్మి హైస్కూల్, జియోన్ హైస్కూల్ విద్యార్థులు దేశభక్తి గేయాలకు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా, జాయింట్ కలెక్టర్ కె.నిర్మల, అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డి,డీఆర్‌ఓ ఈశ్వరయ్య, రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు వీరబ్రహ్మయ్య, రఘునాథరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధికి చేయూత
Published Fri, Aug 16 2013 5:08 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement
Advertisement