పెద్దాయనకు తుది వీడ్కోలు
నాలుగు దశాబ్దాల పాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, నెల్లూరు పెద్దాయనగా అందరూ పిలుచుకునే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి శనివారం జిల్లావాసులు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. పెద్దాయన మృతి జిల్లాకు తీరనిలోటుగా నేతలు పేర్కొన్నారు. జనార్దన్‌రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి వాకాడుకు తీసుకొచ్చారని తెలియడంతో కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో వాకాడుకు చేరుకుని పెద్దాయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన స్వర్ణముఖితీరం జనసంద్రంగా మారింది.
వాకాడు, న్యూస్‌లైన్ : నేదురుమల్లి నివాసానికి శనివారం ఉదయం ఆరు గంటలకు భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కడసారి నేదురుమల్లి భౌతికకాయాన్ని చూసేందుకు బారులుదీరారు. అశ్రునయనాలతో నివాళులర్పించారు. సాయంత్రం మూడు గంటల వరకు సందర్శన కోసం ఉంచారు. అనంతరం స్వర్ణముఖి తీరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్మశాన స్థలానికి వేదపండితుల మంత్రోచ్ఛణల మధ్య భౌతికకాయాన్ని తరలించారు. దారి పొడవునా ఎన్‌జేఆర్ అమర్హ్రే నినాదాలు మా ర్మోగాయి. భౌతికకాయానికి ఉంచిన చితికి నేదురుమల్లి పెద్ద కుమారుడు రాంకుమార్‌రెడ్డి నిప్పు పెట్టారు.
ప్రముఖుల నివాళి
రాజకీయ రంగంలో ఉద్ధండుడిగా పేరు గాంచిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ప్రముఖులు వాకాడుకు చేరుకుని ఆయనకు కడసారి నివాళులర్పించారు. నేదురుమల్లి కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా పనిచేసి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మేరిగ మురళీధర్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనీల్‌కుమార్‌యాదవ్, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పసల పెంచలయ్య, అజీజ్, డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు కరణం బలరాం, జెడీ శీలం, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, చింతా మో హన్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, రెడ్డివారి చెంగారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచల బాబుయాదవ్, కొడవలూరు ధనుంజ యరెడ్డి, సీవీ శేషారెడ్డి, పనబాక కృష్ణయ్య, సినీనటుడు మోహన్‌బాబు, టీడీపీ నాయకులు బల్లి దుర్గాప్రసాద్‌రావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెలవల సుబ్రమణ్యం, నన్నపనేని రాజకుమారి, సింహపురి యూనివర్శిటీ వైస్ చాన్సలర్ రాజారామిరెడ్డి తదితరులు కడసారి వీడ్కోలు పలికారు.
శోకసంద్రంలో స్వర్ణముఖి తీరం
వాకాడు సమీపంలోని స్వర్ణముఖి తీరం శోకసంద్రంలో మునిగింది. నేదురుమల్లి భౌతికకాయాన్ని స్వర్ణముఖిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్మశాన స్థలికి తీసుకు రావడంతో ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నవారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. కడసారిగా పెద్దాయనకు వీడ్కోలు పలికారు.