‘చింతా’ హౌసింగ్ గేమ్!
- ఓట్ల కోసం రాజీవ్ ఆవాస్ యోజన
- మూడు నెలల్లో పదివేల ఇళ్లు నిర్మిస్తారట!
- ఆరేళ్లుగా మొండిగోడలకే పరిమితమైన దామినేడు హౌసింగ్ స్కీం
- పట్టించుకోని ఎంపీ చింతామోహన్
సాక్షి, తిరుపతి: ఓట్ల కోసం పేదలతో చింతా మోహన్ ‘హౌసింగ్ గేమ్’ మొదలు పెట్టారు. ఆ గేమ్ పేరు ‘రాజీవ్ ఆవాస్ యోజన’ (ఆర్‌ఏవై). సీమాంధ్ర ప్రాంతం సమైక్య ఉద్యమంతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. చింతామోహన్ మాత్రం ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. అయితే ప్రజల ఆకాంక్షను చింతా ఆలస్యంగా గుర్తించారు. మౌనంగా ఉంటే త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమనుకున్నారు.
ఢిల్లీ స్థాయిలో పావులు కదిపి ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పేరుతో ఓట్ల రాజకీయం మొదలు పెట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తన లోక్‌సభ పరిధిలోనిది కావటంతో అందులోని వికృతమాల పంచాయతీ వద్ద ఎయిర్‌పోర్టు పక్కన పది వేల ఇళ్లు నిర్మిస్తామని, తిరుపతిలోని పేదలందరికీ అక్కడ గృహాలు కేటాయిస్తామని మహిళాగ్రూప్‌ల వద్ద, తన అనుచరుల ద్వారా దరఖాస్తులు సేకరించటం ప్రారంభించారు. హడావుడిగా వికృతమాల వద్ద ఆర్‌ఏవై కింద నిర్మాణాలు చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
దామినేడు ఇళ్లు కనిపించలేదా?
తిరుపతిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే చిత్తశుద్ధి చింతామోహన్‌కు లేదు. ఎందుకంటే ఆరేళ్లుగా దామినేడు వద్ద 4,087 ఇళ్లు మొండిగోడలతోనే ఉన్నాయి. తిరుపతి లోని పేదలందరికీ ఇళ్లు కట్టించేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక ల్పించారు. ఈ క్రమంలో 2008లో ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ ఫర్ స్లమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఐహెచ్‌ఎస్‌డీపీ)లో భాగంగా దామినేడు, పాడిపేట, తనపల్లె, అవిలాల వద్ద అపార్ట్‌మెంట్ల నిర్మాణం ప్రారంభించారు.
ఇవి పూర్తయితే తిరుపతికి చెందిన 4087 కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతుంది. మహానేత మరణం తర్వాత ఈ నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. నేటికీ మొండిగోడలు, పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఈ వేలాది ఇళ్లన్నీ చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నిర్వహణ తిరుపతి కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నా, అక్కడి ఇళ్లలో చేరితే ఓటర్లంతా చంద్రగిరి అసెంబ్లీ, చిత్తూరు ఎంపీ పరిధిలోకి వెళతారు. దీంతో అక్కడ నిర్మాణం ఆపి, తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే శ్రీకాళహస్తి పరిసరాల్లో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని ఆర్‌డీవో, తహశీల్దార్ల పైన ఎంపీ ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఐహెచ్‌ఎస్‌డీపీతో పాటు జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కింద చేపట్టిన మొత్తం పదివేల ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఇళ్లను పూర్తి చేయించాల్సిన చింతామోహన్ గాలికి వదిలేశారు. తాజాగా రాజీవ్ ఆవాస్ యోజన తెరపైకి తెచ్చారు.
మూడు నెలల్లో ఎలా సాధ్యం?
దామినేడు చుట్టుపక్కల ఆరేళ్ల క్రితం చేపట్టిన 4087 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. మరి మూడు నెలల్లో వికృతమాలవద్ద 10 వేల ఇళ్లను చింతామోహన్ ఎలా పూర్తి చేయగలరు? ఇంత పెద్ద ఎత్తున నిర్మించే గృహనిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వెంటనే ఎలా వస్తాయి? ఆర్‌ఏవై కింద చేపడుతున్న ఇళ్లను రానున్న మూడు నెలల్లో పూర్తి చేసి కేటాయించటం సాధ్యమా ? ఇవీ సగటు జీవి ప్రశ్నలు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనే పేదల ఆకాంక్షతో చింతామోహన్ ఆడుతున్న ‘హౌసింగ్ గేమ్’గా పలువురు అభిప్రాయపడుతున్నారు.