‘చింత’లేని మోహన్!
*మొన్న వ్యతిరేకించి.. నిన్న సమర్థించి.. నేడు మౌన ముద్ర
*రాష్ట్ర విభజనపై పెదవి విప్పని తిరుపతి ఎంపీ
*రానున్న రోజుల్లో పదవి కోసమే తీరు మార్చుకున్న వైనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ఉద్యమిస్తున్నా దీనిపై తిరుపతి ఎంపీ చింతామోహన్‌కు ఏ మాత్రం చింత ఉన్నట్టు లేదు. కాంగ్రెస్ అధినేత్రిని నమ్ముకుంటే చాలు, తనకు మేలు జరుగుతుందనుకున్నారేమో.. గురువారం తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో పలువురు సీమాంధ్ర ఎంపీలు గళం విప్పినా, చింతామోహన్ మాత్రం ఉన్నా లేనట్లుగానే వ్యవహరించారు.
మొదటి నుంచీ విభజనను సమర్థిస్తూ వచ్చారని ఆయన తీరును బట్టి చెప్పవచ్చు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగిన రోజుల్లో కూడా ఇల్లు వదిలి బయటకు రాలేదు. పైగా సమైక్యవాదులపై ఆయన కొరడా ఝుళిపించారు. సమైక్య నినాదాలతో ఆయనను అడ్డుకున్న వారిపై కేసులు బనాయించారు. ఇదంతా రానున్న కాలంలో పదవి కోసమేననేది అందరికీ అర్థమైంది. అనూహ్యంగా నాలుగు రోజుల క్రితం తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ వారు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు పలికారు. అయితే ఓటర్లను నమ్ముకోవడం కంటే సోనియమ్మనే నమ్ముకోవడం మంచిదని చింతా భావించారు.
ఆయన సన్నిహితులతో మాట్లాడుతూ ‘‘సోనియమ్మతో మంచిగా ఉంటే ఎప్పుడైనా ఏదో ఒక పదవి రాబట్టుకోవచ్చు. అంతేకాని ఈ జనాన్ని నమ్ముకుంటే నాకు ఒరిగేదేమీ లేదు’’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం పార్లమెంటు రణరంగంగా మారిన విషయం తెలిసిందే. తిరుపతి నగరం నుంచి ప్రాతిథ్యం వహిస్తున్న చింతా మోహన్ ఉన్నాడో లేడోననే సందేహం వచ్చే విధంగా ఆయన వ్యవహరించారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి తిరుపతి రానున్నారు. ఎంపీ తీరుపై సమైక్యవాదులు ఏవిధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.