సాక్షి, విశాఖపట్నం : ప్రజల నిరసనలు, ఆందోళనల నడుమ మూడో విడత రచ్చబండ ముగిసింది. భీమిలిలో నవంబర్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం వరకు మొక్కుబడిగానే సాగింది. ప్రజలకు ప్రయోజనమివ్వని కార్యక్రమంగా మిగిలి పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకు వచ్చేందుకు వేదికయింది. విస్తృత బందోబస్తు, విపరీత ఆంక్షల నడుమ ఈ సభలను అధికారులు, అధికారపార్టీవారు మమ అనిపించారు. సమస్యలపై ప్రశ్నించే వారిని అడ్డుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ సభలు జరిగాయి.
జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుల కోసం 62,059 , పింఛన్ల కోసం 28,482, ఇళ్ల కోసం 59,989 దరఖాస్తులొచ్చాయి. రేషన్‌కార్డులలో వయస్సు మార్పు కోసం మరో 1198 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీని నిర్వహణకు మండలానికి రూ.70వేలు చొప్పున ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదు. నవంబర్ 15న చోడవరంలో జరిగిన సభలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావులకు సభల్లో నిరసనలు ఎదురయ్యాయి. పాడేరు సభలో పెంచిన పరీక్ష ఫీజులను రద్దు చేయాలని విద్యార్థులు, బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మంత్రి బాలరాజు ఎదుట నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకెళ్ళేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని కొండకుమ్మర్లు మంత్రిని నిలదీశారు. అనకాపల్లి సభలో మంత్రి గంటా శ్రీనివాసరావుకూ నిరసనలు తప్పలేదు. ఇక్కడ సమస్యల్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన 54మంది టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు చేదు అనుభవం ఎదురయింది. యలమంచిలి మండలం పీఎన్‌ఆర్‌పేట కార్యక్రమంలో ఇందిరమ్మ బిల్లు అందలేదంటూ మొగ్గా అప్పారావు అనే లబ్ధిదారుడు ప్రస్తావించగా ఎమ్మెల్యే కన్నబాబు సహనం కోల్పోయి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబుపాలెం సభలో వేదికపైకి ఎందుకు తనను ఆహ్వనించలేదని గ్రామ సర్పంచ్ లంబా అప్పారావు ప్రశ్నించగా.. ‘ఇది అధికారుల సభ అని,పిలవాల్సిన అవసరం లేదని, ఇదే నా స్టయిల్ ’ అని దురుసుగా మాట్లాడారు. క్రషర్ డీడీ చార్జీలను విపరీతంగా పెంచడంపై తిమ్మరాజుపేటలో పలువురు రైతులు ఎమ్మెల్యే కన్నబాబును నిలదీశారు.
పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అరకులోయలో జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే సోమ ప్రసంగాన్ని ఏపీ గిరిజన సంఘం సభ్యులు అడ్డుకున్నారు. గత రచ్చబండలో ఇచ్చిన వినతులను ఇప్పటికీ ఎందుకు పరిష్కరించలేదని నిలదీసిన గిరిజన సంఘం ప్రతినిధులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కశింకోట సభకు మంత్రి గంటా హాజరు కాకపోవడంతో స్థానికులు అధికారుల్ని నిలదీశారు.
ముగిసిన ‘మూడో విడత’
Published Sun, Dec 1 2013 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement