సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 29న నగరంలో నిర్వహించబోయే సకల జనుల భేరి సదస్సును అత్యంత క్రమశిక్షణతో, పకడ్బందీ ప్రణాళికతో జరపాలని తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం నేతృత్వంలో హైదరాబాద్‌లోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ ముఖ్యులు సమావేశమయ్యారు. సకల జనుల భేరి వేదిక, అనుమతి, సభా నిర్వహణ, విద్యార్థుల పాత్ర వంటివాటిపై చర్చించారు. దీనికోసం ఒక నిర్వహణ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిలో జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, సీ విఠల్, వి. శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, రాజేందర్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ ఇన్‌చార్జీగా రసమయి బాలకిషన్, మైదానం నిర్వహణకు ఇన్‌చార్జీగా పి. రఘు (విద్యుత్ జేఏసీ) వ్యవహరిస్తారు.
పార్కింగ్ వ్యవహారాన్ని సీ విఠల్ పర్యవేక్షిస్తారు. 27న అన్నిపార్టీల ప్రతినిధులతో మళ్లీ సమావేశం కానున్నారు. సభావేదికపై సుమారు 160-200 మంది ప్రతినిధులు వేదికపై ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. పార్టీల నుండి, సంఘాల నుండి ఒకొక్కరికి మాత్రమే ప్రసంగించే అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకున్నారు. ప్రసంగించే వారు 30-40 మందికి మించకుండా నియంత్రించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనేలా సమాయత్తం చేయాలని విద్యార్థి నేతలను కోరారు. అలాగే, సభ జరిగే నిజాం కళాశాల మైదానాన్ని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులతో కలిసి కోదండరాం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీమాంధ్రుల కృత్రిమ ఉద్యమానికి, అవాస్తవ ప్రచారాలకు సభ ద్వారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కోదరండరాం అన్నారు.
సీపీఐ నేతలతో టీజేఏసీ భేటీ
తెలంగాణ జేఏసీ నేతలు బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ, కార్యదర్శివర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ఈనెల 29న సకల జనుల భేరికి మద్దతు ఇవ్వాలని కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య వారికి విజ్ఞప్తి చేశారు. గురువారం జరిగే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో చర్చించి చెబుతామని నారాయణ అన్నట్టు తెలిసింది.
క్రమశిక్షణతో సకలజనుల భేరి
Published Thu, Sep 26 2013 3:08 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement