- జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ
మచిలీపట్నం(ఈడేపల్లి) : ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేదిశగా పాటుపడదామని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో శనివారం 2014 ఎస్సెస్సీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగాఅనూరాధ పాల్గొని మాట్లాడారు.
విద్య, ఆరోగ్య రంగాలు సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకమైనవని చెప్పారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మరుగుదొడ్లు, ప్రహరీగోడ తప్పనిసరి చేస్తూ నిధులు కేటాయిస్తామని చెప్పారు. మరో అతిథి ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీపడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని ముఖ్యమంత్రిని కోరామని చెప్పారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 84 శాతంమంది విద్యార్థులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని వెల్లడించారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ అరకొర సౌకర్యాలతోనే ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు నమోదు కావడం ఎంతో అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులే దేశ ప్రగతికి దిక్సూచి అని తెలియజేశారు. సంఘం కార్యకలాపాల్ని, ప్రగతిని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శికేఏ ఉమామహేశ్వరరావు కూలంకషంగా వివరించారు.
అనంతరం పదిగ్రేడు పాయింట్లు సాధించిన విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న పి.వెంకటేశ్వరరావు(సాలెంపాలెం), శ్రీమన్నారాయణ(గొల్లపూడి), ఎం.నాగమల్లేశ్వరరావు (చంద్రాల మీర్జాఅలీహైదర్(నిడుమోలు)ను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీ దివాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, జిల్లా సహాధ్యక్షుడు జి.రమేష్, కోశాధికారి మనోహర్, మచిలీపట్నం పట్టణశాఖ అధ్యక్షుడు తోట రఘుకాంత్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.