సమైక్య తీర్మానమే శరణ్యం
Published Fri, Jan 10 2014 2:22 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయడం ద్వారానే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చునని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు అభిప్రాయపడ్డారు. చర్చను అడ్డుకునే ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేయాలని ఎన్జీవో సంఘ నేత అశోక్‌బాబు పిలుపు ఇవ్వడంపై మండిపడ్డారు. చర్చకు అవకాశం కల్పిస్తే విభజనకు సహకరించినట్టేనన్నారు. న్యాయవాదులు, విద్యావేత్తలు, రైతులు, డాక్టర్లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు వ్యక్తం చేశారు.
విభజనకు సీమాంధ్ర నాయకులు అడ్డుకోవాలి
బిల్లుకు వచ్చిన రోజున చర్చకు నోచుకోకపోవడం అన్యాయం. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా విభజనను అడ్డుకోవాలి.
డి.విజయభాస్కరరావు, మండల
వ్యవసాయాధికారి, జలుమూరు
ఓటింగ్ జరగాలి
వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్ చేస్తున్నట్లు సమగ్ర ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరపాలి. క్లాజ్ వారీగా మాత్రం ఓటింగ్ చేపట్టరాదు. ఒక ఎమ్మెల్యే ఒక అభిప్రాయం చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. దానివల్ల పరోక్షంగా విభజన వాదానికి సమ్మతిని తెలియజేసినట్లవుతుంది.
-ఆర్.జోగేశ్వరరావు, కరస్పాడెంట్, గాయత్రీ డిగ్రీ కళాశాల, హిరమండలం
చర్చ తప్పనిసరి
ఎజెండా తీర్మానం మీద సమగ్రమైన చర్చ జరిగినపుడే విలువ ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి ఒక్కో చట్టాన్ని తయారు చేస్తున్న శాసనసభ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నపుడు మాత్రం మౌనం దాల్చడం అప్రజాస్వామికం. చట్ట సభల్లో చర్చించినపుడు మాత్రమే ప్రజల మనోభావాలను గౌరవించినవారవుతారు. ఈ విషయంలో ఏపీ ఎన్‌జీవో అధ్యక్షులు అశోక్‌బాబు వాదనను సమర్థిస్తున్నాం. - ఎ.శ్రీనాథస్వామి, ఎంపీడీఓ, హిరమండలం
సమైక్య తీర్మానం చాలా అవసరం
రాష్ట్ర ప్రజలంతా సమైక్యాన్ని కోరుకుంటున్నప్పుడు చట్ట సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి సమైక్యాన్ని కోరడంలో తప్పు ఏముంది. సమైక్యతీర్మానం అనంతరం బిల్లుపై చర్చించే అవకాశం ఉంటుంది. చర్చకు ముందు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల సమైక్యవాదం స్పష్టంగా తెలుస్తుంది.
ఎం.కె.రాము, వేదిక సేవా సంస్థ
అధ్యక్షుడు, నరసన్నపేట
సమైక్య తీర్మానమే ఉత్తమం
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తే దానికి ప్రాధాన్యం ఉంటుంది. చర్చ వల్ల న్యాయం జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వ కిరణ్‌కుమార్ రెడ్డి చేత ఆడిస్తున్న నాటకంలో భాగమే చర్చ. దీనిని కొనసాగిస్తే బిల్లు ఆమోదం చేసుకోవడానికి వీలవుతుంది. సీమాంధ్ర ఎమ్యెల్యేలు సమైక్య తీర్మానానికి కట్టుబడి.. దానిని సాధించేందుకు ముందుకుపోవాలి.
-పేరాడ సోమేశ్వరరావు, అధ్యక్షుడు, సమైక్యాంధ్ర ఫోరం, వజ్రపుకొత్తూరు
అశోక్‌బాబు మాటలు విభజన కోసమే
అశోక్‌బాబు మాట లు రాష్ట్ర విభజన కోసమే అన్నట్టు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా ఆదేశాలతోనే కిరణ్‌కుమార్డ్, అశోక్‌బాబులు మాట లాడుతూ విభజన కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు. వైఎస్సార్‌ిసీపీ ఓటింగ్ కోసం అసెంబ్లీలో అడ్డుపడుతుంటే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
రెడ్డి విజయకుమార్, సీనియర్ అడ్వకేట్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడులు,రాజాం.
బిల్లే కీలకం
ప్రస్తుతం అసెంబ్లీలో చర్చల కంటే బిల్లే కీలకం. విలువైన సమయం వృథా చేయటం వల్ల బిల్లు పెట్టకుండా కాలం గడిచిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్రం కాంగ్రెస్ పెద్దలు కూడా బిల్లు లేకుండా సభలో చర్చలతో సరి పెట్టాలని చూస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం. బిల్లు ఓడిస్తేనే సమైక్యాంధ్రకు మద్దతు లభిస్తుంది.
ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, చీఫ్ వార్డెన్,బీఆర్‌ఏయూ
బిల్లును ఓడించి పార్లమెంటుకు పంపాలి
అసెంబ్లీలో చర్చ జరగటం వల్ల ప్రయోజనం లేదు. ఎవరి ప్రాంతానికి అనుకూలంగా వారు వాదనకు దిగుతారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించదు. అందుకే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలి. దాన్ని ఓడించి పార్లమెంటుకు పంపించాలి. అప్పుడే పార్లమెంట్ ఎటు వంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుస్తుంది. అసెంబ్లీలో ఓడించిన బిల్లుకు మద్దతు ఇవ్వట మంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించక పోవటమే. న్యాయపరంగా కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
- డాక్టర్ పి.శ్రీసుధ, ఎల్‌ఎల్‌బీ బోధకురాలు,బీఆర్‌ఏయూ
చర్చను ప్రారంభిస్తే విభజనకు అంగీకరించినట్టే
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చను ప్రారంభిస్తే పరోక్షంగా విభజనకు అంగీకరించినట్టే. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంతో సమర్ధనీయం. సమైక్య తీర్మానం చేసి బిల్లును వెనక్కు పంపించేస్తే సరిపోతుంది కదా. అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఏకాభిప్రాయానికి వచ్చి విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానాన్ని చేపడితే చాలు. ఈ విషయంలో అశోక్‌బాబు ఎందుకలా ధర్నాలు చేయమని పిలుపునిచ్చారో అర్థం కావడం లేదు.
ఉత్తరావల్లి మురళీమోహనరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు,
Advertisement
Advertisement