వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభను ఎవరూ ఆపలేరని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు
నంద్యాల, న్యూస్‌లైన్:
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభను ఎవరూ ఆపలేరని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. నంద్యాలలోని పద్మావతినగర్‌లో పది రోజు లుగా కొనసాగుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలే దీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ సభకు భారీ ఎత్తున జనం తరలి వస్తారని పోలీస్ నిఘా నివేదికల ద్వారా తెలుసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కుమ్మక్కై అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంతంగా సభను నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు హామీ ఇస్తున్నా అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పొంతలేని కారణాలతో సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వం పునరాలోచించి 19వ తేదీ సమైక్య శంఖారావానికి అనుమతి ఇవ్వాలన్నారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేసి సదస్సును నిర్వహించి తీరుతామన్నారు. తెలంగాణలోనే సమైక్య వాదులు అధికంగా ఉన్నారని, ఇందుకు బెయిల్‌పై విడుదలైన జననేతకు అక్కడి ప్రజలు నీరాజనం పలకడమే నిదర్శనమన్నారు. జగన్ పేరు వింటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వణుకు పుడుతుందన్నారు. సమైక్య వాదినని చెప్పుకునే ఆయన సమైక్య శంఖారావం సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
బాబు.. రాష్ట్రం కోసం పోరాడు
తెలుగు దేశం పార్టీ అధినేత కుట్రలతో రాజకీయాలు మాని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి ఆయన ఇంత వరకు సమైక్యం గురించి ఎందుకు మాట్లాడలేదని భూమా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి తమ మేధస్సును ఉపయోగిస్తారని చెప్పుకునే ఆయన పార్టీని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కోట్ల రూపాయలు కుమ్మరించి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఢిల్లీలో దీక్ష చేపట్టారన్నారు. ఎలాంటి ప్రకటన చేయకుండా తన పరువు తానే తీసుకున్నాడని చెప్పారు. 65 ఏళ్ల వయస్సులో షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఎలా దీక్షను చేశారో అందరికీ అర్థమవుతున్నదన్నారు. అనంతరం దీక్షలో కూర్చొన్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు.