వైదొలగాల్సిందే
Published Tue, Sep 17 2013 5:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, కడప: సమైక్యరాష్ట్రం కోసం అలుపెరగని ఉద్యమం నడుస్తోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం విషయంలో పాలకపక్షం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సీమాంధ్రలో సకల జనం సమైక్యాంధ్రప్రదేశ్ సాధనే అజెండాగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రాజకీయ సంక్షోభమే ఏకైక లక్ష్యంగా ఉద్యమించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాల కోసం ఒత్తిడి పెంచుతున్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ 48 రోజులుగా జిల్లాలో అలుపెరగని పోరాటాన్ని సమైక్యవాదులు చేస్తున్నారు. ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉద్యమకారులు భావిస్తున్నారు. పదవుల్లో ఉంటేనే ప్రాంతం కోసం ఉద్యమించేందుకు వీలుంటుందని, అందుకోసమే కొనసాగుతున్నామని నమ్మబలుకుతూ హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. అయితే ప్రాంతం కోసం, ప్రజానీకం కోసం పదవుల నుంచి వైదొలగాల్సిందేనని మంత్రులు, ఎంపీలకు సమైక్యవాదులు ఆల్టిమేటం జారీ చేస్తున్నారు. రాజకీయ సంక్షోభం సృష్టించాలని తద్వారా యూపీఏ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
అరే ఇష్కీ.. రాజీనామా చేశానన్నా వినరే..
విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్యమకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు 18 వతేదీ లోగా రాజీనామాలు చేసి, వాటిని ఆమోదింపజేసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆతర్వాత చోటుచేసుకునే ఘటనలకు తాము బాధ్యులం కాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రుల ఇళ్లకు హెచ్చరిక నోటీసులు అంటించారు. మంత్రులు అహ్మదుల్లా, రామచంద్రయ్య, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ ఇళ్లకు సోమవారం హెచ్చరిక నోటీసులు అంటించారు. ఈవిషయాన్ని తెలుసుకున్న ఓమంత్రి ‘అరే ఇష్కీ... రాజీనామా చేశామన్నా విన్పించుకోరే’ అంటూ తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం ఉదృతమవుతున్నా ఆశించిన మేరకు ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకే ఓమారు మంత్రి అహ్మదుల్లా, 20సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసీరెడ్డిలపై చెప్పులు విసిరిన చరిత్ర ఉత్పన్నమైంది. 48 రోజులుగా ఉద్యమం చేస్తుంటే మంత్రులు కేవలం రెండు రోజులు మాత్రమే జిల్లాకు వచ్చి వెళ్లారని పలువురు పేర్కొంటున్నారు.
రామ...రామ నోరు మెదపరే...!
కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై సమైక్యవాదులు ఆగ్రహం ప్రదర్శించడం వెనుక అర్థం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ఉద్యమం బలపడే కొద్ది కాంగ్రెస్ నేతలపై సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే కమలమ్మ సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన చవిచూశారు. సమైక్య ఉద్యమం పట్ల, ఈ ప్రాంత పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న మంత్రి రాయచంద్రయ్య ఆశించిన మేరకు ఉద్యమానికి దన్నుగా నిలవలేదని సమైక్యవాదులు విశ్వసిస్తున్నారు. రాజకీయాల కోసం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టెందుకు చూపిన ఉత్సాహం సమైక్యరాష్ట్రం కోసం చూపించలేదనే ఆరోపణలను రామచంద్రయ్య ఎదుర్కొంటున్నారు.
తెలుగుతమ్ముళ్లలో కొరవడిన చిత్తశుద్ధి
రాష్ట్ర విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే, మలిముద్దాయి తెలుగుదేశం పార్టీనే అని సమైక్యవాదులు భావిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన తెలుగుతమ్ముళ్లు రాజకీయాలే ధ్యేయంగా వ్యవహరిస్తుండటంపై సమైక్యవాదులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ సంక్షోభం కోసం ముందుగా మంత్రులు, ఎంపీలపై ఒత్తిడి తేవాలని భావిస్తున్న సమైక్యవాదులు మలిదశలో విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలపై దృష్టి సారించేందుకు సమాయత్తం కానున్నట్లు సమాచారం. సమైక్య రాష్ట్రం సాధన కోసం ఏమాత్రం చిత్తశుద్ధి చూపకుండా ఇతరులపై ఆరోపణలు చేస్తూ రాజకీయాలకే పరిమితం కావడాన్ని సమైక్యవాదులు ఆక్షేపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీలాగా సమైక్యమే అజెండాగా సమైక్యశంఖారావం పూరించాలని కాంగ్రెస్, టీడీపీలపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. జనాగ్రహంకు గురి కాకమునుపే రాజకీయ నేతలు ప్రజానీకానికి దన్నుగా నిలవాలని సమైక్యవాదులు కోరుతున్నారు.
Advertisement
Advertisement