మార్మోగనున్న సమైక్యనాదం
Published Fri, Nov 22 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
అమలాపురం, న్యూస్‌లైన్ : స్థానిక బాలయోగి స్టేడియం శుక్రవారం మధ్యాహ్నం జరిగే కోనసీమ సమైక్య గర్జన సభకు సిద్ధమైంది. దాదాపు లక్ష మంది హాజరు కాగలరన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు దాదాపు 15 మంది ఎన్జీఓ నేతలు హాజరవుతున్నారు. గురువారం సాయంత్రానికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 30 మంది ఆసీనులయ్యేలా వేదికను తీర్చిదిద్దారు. మైదానంలో దాదాపు 50 వేల కుర్చీలను సిద్ధం చేశారు. కోనసీమ నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టే కోనసీమ జేఏసీ ఏర్పాట్లు చేసింది.
జిల్లా జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథరావు, కోనసీమ జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు, సలహాదారుడు నక్కా చిట్టిబాబు తదితర ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏ రాజకీయ పార్టీ నాయకులను వేదికపైకి ఆహ్వానించకుండా కేవలం సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకుల్లో ఎంపిక చేసిన వారిని మాత్రమే ఆహ్వానించనున్నారు. జిల్లాలోని అన్నిశాఖల ఉద్యోగులనూ సభకు హాజరు కావాలని ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు జేఏసీ ప్రతినిధులు చెపుతున్నారు.
అశోక్‌బాబుతో పాటు ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ఎన్జీఓల సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు పి.వి.వి.సత్యనారాయణ, 13 జిల్లాల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు, ఐటీ రంగాల ప్రముఖులు హాజరై రాష్ట్ర విభజన జరిగితే ఎదురయ్యే నష్టాలను వివరించనున్నారు. సమైక్య ఉద్యమంలో ఆది నుంచీ కోనసీమ జేఏసీ చురుకైన పాత్ర పోషిస్తూ జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అశోక్‌బాబు ఇటీవల కాకినాడలో జరిగిన సభలో పాల్గొన్నప్పటికీ కోనసీమలో ఉద్యమ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రెండోసారి జిల్లాకు రావడానికి సుముఖత చూపించారు.
కీలక నిర్ణయాలకు వేదిక..?
అమలాపురంలో శుక్రవారం జరిగే సమైక్య గర్జన సభ కీలక నిర్ణయాలకు వేదిక కానుందని తెలుస్తోంది. మంత్రుల బృందం కేంద్రప్రభుత్వానికి ఇవ్వనున్న నివేదికను క్యాబినెట్ ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అమలాపురం సభలో అశోక్‌బాబు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. కాగా హెలెన్ తుపాను హెచ్చరికలతో జిల్లా అంతా విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో సభకు తరలివచ్చే సమైక్యవాదులు గొడుగులతో రావాలని కోనసీమ జేఏసీ కోరింది. శుక్రవారం ఉదయానికి వర్షం తెరిపివ్వకపోయినా సమైక్యవాదులు సభకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.
Advertisement
Advertisement