రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర ప్రజలను నమ్మించి ముంచేశాయని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు.
బాపట్లటౌన్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర ప్రజలను నమ్మించి ముంచేశాయని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సమైక్య నినాదంతో తమ పార్టీ పోరాటాలు చేస్తుంటే కాంగ్రెస్, టీడీపీల నేతలు మాత్రం బయటకు సమైక్యవాదులమేనంటూ మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌తోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల రథంబజారు సెంటర్‌లో శుక్రవారం రాత్రి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇక్కడ సమైక్యాంధ్ర...అక్కడ జై తెలంగాణ అంటూ ద్వంద వైఖరి అవలంభిస్తున్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ర్టం మొత్తం తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే కనీసం సమావేశానికి కూడా హాజరు కాకపోవడం కుమ్మక్కులో భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు.
బెల్టుషాపుల ఘనత బాబుదే..
గ్రామాల్లో సైతం ఇంటికో బెల్టుషాపు ఏర్పడిందంటే ఆ ఘనత చంద్రబాబుదేనని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా సమైక్యం అంటున్న తరుణంలో అక్కడ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, సీమాంధ్రలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరగటం రాజకీయ డ్రామా కాదా అని నిలదీశారు. ఎన్ని ఎత్తుగడలు పన్నినా ప్రజలు నమ్మకపోవడంతో మతిభ్రమించిన బాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం, దాన్ని ఎల్లోమీడియా కథలుగా ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రానికి దిక్చూచి జగన్
రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దిక్చూచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఒక వైపు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఒంటిచేత్తో పోరాడుతున్న యోధుడు జగన్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఆయన వల్లే సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, మైనార్టీ విభాగం కన్వీనర్ సయ్యద్ మాబు, బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ళ రేవతి, విద్యార్థి విభాగం కన్వీనర్, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులున్నారు.