ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగుతోంది. రోజురోజుకూ ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ ఆందోళనలు శుక్రవారంతో 52వ రోజుకు చేరుకున్నాయి. ఎన్‌జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండో రోజు వరుసగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఒంగోలు నగరంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌జీఓల ఉద్యమంతో నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు రెండవ రోజు తలుపులు తెరుచుకోలేదు.
అలాగే గురువారం ఒంగోలు వచ్చిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యవహరించిన తీరుకు, సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు పనబాక లక్ష్మి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కింద మంట పెట్టిన పెద్ద పాత్రల్లో కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు 500 అడుగుల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు దీక్షా శిబిరం వద్ద రోడ్డుపై ఆటలు ఆడి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని, అంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రెండో రోజూ తెరుచుకోని కార్యాలయాలు, బ్యాంక్‌లు: ఉద్యోగుల ఉద్యమంలో వరుసగా రెండో రోజు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. అద్దంకిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూయించారు. అనంతరం ఆర్టీసీ, ఎన్‌జీఓ జేఏసీ నాయకులు మూతికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు, మేదరమెట్ల - నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మానవహారం, రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బంగ్లారోడ్‌లో చేపట్టిన ఉద్యోగుల రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఇక రాష్ట్ర విభజనను నిరసిస్తూ అద్దంకిలో ముస్లింలు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. కొరిశపాడు మండలం రావినూతలలో సమైక్యాంధ్ర కోసం విద్యార్థులతో ర్యాలీ, ఆంధ్రప్రదేశ్ ఆకారంలో మానవహారం నిర్వహించారు. బల్లికురవలో ఉపాధ్యాయుల నిరసన దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇక చీరాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 24వ రోజుకు చేరాయి.
మాలమహానాడు ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టారు. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నాయిబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. పర్చూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. మార్టూరు మండలంలోని కోలలపూడిలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా వరినాట్లు వేసి నిరసన తెలిపారు. యద్దనపూడిలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్యోగులు మానహారం చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో గిద్దలూరు మండలంలోని క్రిస్టియన్ సమైక్యాంధ్ర అసోసియేషన్ సభ్యులు దీక్షలు చేపట్టారు. కంభంలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. జేఏసీ నాయకులు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు, టెలిఫోన్ కార్యాలయాలను మూయించారు. కొమరోలులో ఆర్య మరాఠీలు భారీ ర్యాలీ, వంటావార్పు, వివిధ వేషధారణల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు తెలిపారు. కందుకూరులో వరుసగా రెండవ రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. టంగుటూరులో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు 9వ రోజుకు చేరాయి. శింగరాయకొండ మండలంలోని పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
కనిగిరిలో జన చైతన్యయాత్ర: కనిగిరిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వైద్య ఆరో గ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది రిలే దీక్షలో కూర్చున్నారు. పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరిగి పాఠశాలలు మూయించడం, సమైక్యాంధ్రకు మద్దతుగా పం చాయతీల్లో తీర్మానాలు చేయించడం, ప్రజలను చైతన్యం చేసేందుకు జన చైతన్య యాత్రను చేపట్టారు. గ్రామీణ ఆటో కార్మికులు రాష్ట్ర విభజనకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ రిలే దీక్షలు పదో రోజుకు చేరాయి. టీడీపీ కార్యకర్తల దీక్షలు 12వ రోజు కొనసాగాయి. హనుమంతునిపాడులో సమైక్యాంధ్రకు మద్దతు జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి, బ్యాంక్‌లు మూయించారు. సీఎస్ పురం మండలం డీజీపేటలో ఉపాధ్యాయులు రోడ్డుపై విద్యార్థులకు విద్యాబోధన చేపట్టారు. పామూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు.
పొదిలి చేరిన ఆత్మఘోష పాదయాత్ర: ఆర్యవైశ్యులు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర పొదిలి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ దోర్నాలలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 130 ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా
Published Sat, Sep 21 2013 4:28 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement