
ఆరని మంటలు
అసెంబ్లీలో కిరణ్, బాబుల గైర్హాజరుపై నిరసన
కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్
విశాఖలో అశోక్‌బాబు దిష్టిబొమ్మ దహనం
‘అనంత’లో 72గంటలపాటు రహదారుల దిగ్బంధం
సాక్షి నెట్‌వర్క్: అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. సమైక్యవాదులు మంగళవారం ఎక్కడికక్కడ ముసాయిదా బిల్లు ప్రతులను దహనం చేశారు. అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎస్కేయూ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం-చెన్నై జాతీయ రహదారిని 72గంటల పాటు రహదారి దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాయదుర్గం, పెనుకొండలో విద్యార్థులు స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. తిరుపతిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో నిర్వహించారు.
ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సీఎం కిరణ్‌కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్ధి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చినా సీఎం ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలంటూ రాజకీయ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జె.టి.రామారావు ప్రశ్నించారు. విశాఖలో న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్యవాదులు, ఏలూరులో న్యాయవాదులు ముసారుుదా బిల్లు ప్రతులను తగులబెట్టారు. భీమవరంలో ఆంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అన్ ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్ (రూకా) ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యార్థి గర్జన నిర్వహించారు. కాకినాడలో ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించి, టి.బిల్లు ముసాయిదా ప్రతులను, సోనియా, దిగ్విజయసింగ్ ఫ్లెక్సీలను దహనం చేశారు. కాకినాడ జేఎన్‌టీయూకే పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మామిడికుదురులో విద్యార్థులు 216 జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులతోపాటు, సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ ఫోటోలను తగుల పెట్టారు. అనంతరం బందర్‌రోడ్డుపై ధర్నా చేశారు.
తెలంగాణ బిల్లు కలతతో గుండెపోటు, ఒకరి మృతి
తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో కలత చెంది పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు దళిత వాడకు చెందిన గొటికల లూర్ధురాజు(55) సోమవారం రాత్రి 11 గంటలకు గుండెపోటుతో మరణించాడు.