
మృత్యువులోనూ వెన్నంటి నిలిచాడు
► నారాయణరెడ్డి నమ్మినబంటు సాంబశివుడు
► ప్రత్యుర్థులకు ఎదురొడ్డి నిలిచిన వైనం
వైఎస్సార్ సర్కిల్, వెల్దుర్తి రూరల్, కృష్ణగిరి: దారుణ హత్యకు గురైన పత్తికొండ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డికి బోయ సాంబశివుడు నమ్మినబంటు. నారాయణరెడ్డితో పాటే సాంబశివుడు కూడా హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా నారాయణరెడ్డిని కాపాడేందుకు సాంబశివుడు హంతకులకు ఎదురొడ్డి నిలిచిన తీరు గ్రామంలో చర్చనీయాంశమయ్యింది. సాంబశివుడిది సాధారణ రైతు కుటుంబం. ఇతని గుణగణాలను గమనించి నారాయణరెడ్డి తన ప్రధాన అనుచరునిగా ఎంచుకున్నారు. వారిది దాదాపు పదేళ్ల అనుబంధం. నారాయణరెడ్డి ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉండేవాడు.
నారాయణరెడ్డికి ప్రాణహాని ఉందని తెలిసినప్పటి నుండి మరింత అప్రమత్తంగా ఉంటున్నాడు. నారాయణరెడ్డిని సైతం ఎప్పటికప్పుడు అప్రతమత్తం చేస్తూ ప్రత్యర్థుల కదలికలు కనిపెట్టి వివరించేవాడు. ఆదివారం కూడా నారాయణరెడ్డి వెంటే ఉన్న సాంబశివుడు ఆయన్ను కాపాడాలని ప్రయత్నించాడు. తమ వెంట ఉన్నవారంతా తలోదిక్కూ చెల్లాచెదురైనా సాంబశివుడు మాత్రం అత్యంత తెగువ కనబరిచాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యర్థులకు అడ్డుపడ్డాడు. తనను చంపే వరకు వదిలి పెట్టరని.. మీరు వెళ్లిపోండని నారాయణరెడ్డి చెబుతున్నా ఖాతరు చేయకుండా ఎదురొడ్డి నిలిచాడు. చివరకు ప్రత్యర్థులు అతడిని చంపిన తర్వాతే నారాయణరెడ్డిని అంతమొందించడం గమనార్హం. సాంబశివుడుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.