సాక్షి, ఏలూరు (టూటౌన్): కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతో కాలంగా తమ సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. రెగ్యులరైజ్ చేయటం కుదరకపోతే కనీసం సమాన పనికి సమాన వేతనం అందించాలంటూ అలుపెరుగకుండా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని పాలకులు అమలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది చాలీ చాలని జీతాలతోనే తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు. గొర్రెకు బెత్తుడే తోక అన్న చందంగా వీరు ఎంత పనిచేసినా వచ్చేది మాత్రం నామమాత్రపు వేతనమే. చేసేది ప్రభుత్వ శాఖల్లో కాబట్టి ఎప్పటికైనా పాలకులకు తమపై కరుణ కలుగకపోతుందా.. సర్వీస్ రెగ్యులరైజ్ చేయకపోతారా.. వేతనాలు పెంచక పోతారా.. అనే ఆశతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ బతుకు బండి ఈడుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 14,000 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. కాంట్రాక్టు సిబ్బంది పనిచేయని ప్రభుత్వ శాఖ, సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు.
జగన్ హామీపై హర్షం..
సోమవారం ఆదోని సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీ జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. సుప్రీం కో ర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామంటూ జగన్ ప్రకటించడం పట్ల వీరిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. తమ బాధలను ఆయనైనా అర్థం చేసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు లభిస్తున్న వేతనంలో కనీసం సగం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ భద్రతా కరువే
కాంట్రాక్టు ఉద్యోగానికి భద్రతా కరువే. ఏటా రెన్యూవల్ తప్పనిసరి. ప్రశ్నించే అధికారం లేదు. పని ఎక్కువ వేతనం తక్కువ. వ్యవసాయ శాఖ డిప్లొమా చేసిన మాకు రోజు వారీ కూలీలకు వచ్చేంత కూడా వేతనం లేదు. వ్యవసాయ శాఖలో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఏటా రెన్యూవల్ కోసం పోరాటం తప్పడం లేదు.
–పి.ఆదినారాయణ, జిల్లా అధ్యక్షులు, కాంట్రాక్టు ఎంపీఈఓలు సంఘం
20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూ బొదుగూ లేదు
20 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలుగా కొనసాగుతున్నా. ఉద్యోగం రెగ్యులర్ చేయరు. జీతాలు పెంచరు. పనిభారం పెరిగింది. జిఓల పేరుతో గతంలో ఇచ్చిన జీతం కన్నా రూ.వెయ్యి తక్కువ ఇస్తున్నారు. రూ.11,000 వేతనంతో నగరంలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి.
– మేళ్ల వెంకటేశ్వరమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, ఏలూరు
అమలు కాని సుప్రీం కోర్టు అదేశాలు
కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను పాలకులు అమలు చేయడం లేదు. దీంతో నెలంతా కష్టపడినా వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకురావాల్సిన దుస్థితి. దీనిపై మేమ ఎన్నో సార్లు ఉద్యమాలు చేసినా పాలకులు చలించలేదు.
– కామన సంజయ్, జిల్లా అధ్యక్షుడు, విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్
Comments
Please login to add a commentAdd a comment