రాష్ట్ర విభజన యత్నాలను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించాయి.
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన యత్నాలను వ్యతిరేకిస్తూ.. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించాయి. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసించాలని నాయకులు పిలుపునిచ్చారు. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ప్రధాన రహదారులగుండా వివిధ ప్రాంతాల్లో నినాదాల హోరు మధ్య ర్యాలీ చేశారు.
విజయవాడ వన్‌టౌన్‌లో నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సాగింది. వైఎస్సార్‌సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఆరు మండలాల నుంచి మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు మోటార్‌సైకిళ్లతో ర్యాలీ చేశారు.
మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌బాబు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అక్కడినుంచి మైలవరం చేరుకున్నారు. ఇబ్రహీంపట్నంలో, నూజివీడు పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు చేశారు. పామర్రులో వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.