=నదీ పరివాహాక పొలాలపై కన్ను
=తవ్వకాలకు రైతులచే దరఖాస్తు యత్నం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇసుక సిండికేట్‌లు అనుమతుల్లేకుండానే నదులను తవ్వేశారు. అడ్డొచ్చిన అధికారులపై దాడులకు సైతం దిగారు. రోజురోజుకి వీరి ఆగడాలు అధికమవ్వడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదుతో అడ్డగోలు తవ్వకాలను, అక్రమ రవాణాను కొంతమేరకు కట్టడి చేశారు. కానీ అక్టోబర్ వరదలకు ఇసుక మేటలేసిన పొలాలపై కన్నేశారు. సంబంధిత రైతుల్ని పావుగా వాడుకుని, వాటిలో తవ్వకాలకు అనుమతి తీసుకుని పక్కనున్న నదుల్లో ఇసుక దోచేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు.
తాండవ, గోస్తనీ, వరహా, శారదా తదితర నదుల్లో నిబంధనలకు లోబడి ఇసుక లేకపోవడంతో మూడేళ్లగా లీజులివ్వలేదు. కానీ ఇసుక సిండికేట్లు మాత్రం ఆగలేదు. అడ్డగోలు తవ్వకాలు, రవాణా చేసి కోట్లకు పడగెత్తారు. ఇదే సమయంలో అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు వారికి బాగా కలిసొచ్చాయి. పొంగి పొర్లిన నదులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో నదీ పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలేర్పడ్డాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఇసుక అక్రమార్కులు రంగంలోకి దిగారు.
నదీ పరివాహాక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇసుక మేటలేసున్నాయో ఇప్పటికే గుర్తించారు. వ్యవసాయ అధికారులు కూడా అధికారికంగా జిల్లాలో 120 హెక్టార్ల పొలాల్లో ఇసుక మేటలేసినట్టు నిర్ధారించారు. ఇప్పుడా రైతుల పేర్లును సేకరించే పనిలో పడ్డారు. ఆ రైతులకు ఎంతోకొంత ముట్టజెప్పి, వారి ద్వారానే పొలాల్లో ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులు చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. సాధారణంగా పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించి, తరలించేందుకు మండల అధికారుల ద్వారా అనుమతి తీసుకోవచ్చు. దీన్నే సిండికేట్లు అస్త్రంగా చేసుకుంటున్నారు.
ఇసుక మేటల తొలగింపు అనుమతితో వాటి ముసుగులో పక్కనున్న నదుల్లోని ఇసుకను దోచేయడమే వారి వ్యూహంగా తెలుస్తోంది. అనకాపల్లి, చోడవరం, తగరపువలస కేంద్రాలుగా పావులు కదుపుతూ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కొందరు అధికారులకు ముడుపులందించేందుకు లోపాయికారీగా ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు తెలిసింది.
ఇసుక మేటలపై సిండి‘కేట్లు’
Published Sun, Dec 15 2013 12:50 AM | Last Updated on Mon, May 28 2018 4:20 PM
Advertisement