ఇసు‘కాసు’రులు | sand evacuation at vizianagaram with permission of govt | Sakshi
Sakshi News home page

ఇసు‘కాసు’రులు

Published Sat, Mar 25 2017 4:17 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

sand evacuation at vizianagaram with permission of govt

సర్కారు నిర్ణయం వారికి వరంగా మారింది. ఉచితంగా ఇసుక తరలించుకునే వెసులుబాటు కాసులు కురిపిస్తోంది. అధికారులు సైతం దాడులు నిలిపివేయడం అవకాశంగా మారింది. ఎక్కడబడితే అక్కడ ఇష్టానుసారం తవ్వేస్తూ... ఇతర ప్రాంతాలకు లారీలతో తరలించేస్తూ... ఎంచక్కా జేబులు నింపుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. భవిష్యత్తరాలకు నీటి సమస్య తలెత్తుతుందని తెలిసినా వారికి చీమకుట్టినట్టయినా లేదు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా అనుకూల స్థలాల్లో స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తరలించుకుపోతున్నారు. నిషేధిత ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తవ్వకాలపై స్థానికులు చేస్తున్న ఫిర్యాదులను సైతం అధికారులు పట్టించుకోకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
► నిషేధిత ప్రాంతాల్లో జోరుగా ఇసుక తవ్వకాలు
► అనుకూలమైన ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో డంపింగ్‌
► అనుమతి లేకుండానే యథేచ్ఛగా లారీలతో తరలింపు
► గ్రామాల్లో అనధికారికంగా వేలం పాటలు
► అడుగంటుతున్న భూగర్భ జలాలు
► పట్టించుకోని అధికార యంత్రాంగం

గుర్ల: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌లనుంచి సొంతంగా ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక తరలించుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ అదే అక్రమార్కులకు ఆసరాగా మారింది. ఉచితం పేరుతో ఎక్కడపడితే అక్కడ.. నిషేధిత ప్రాంతాల్లో సైతం తవ్వేస్తూ కాసులు కూడబెట్టుకుంటున్నారు. వాస్తవంగా మండలంలోని చంపావతి నదీతీర ప్రాంతమైన గరికివలస వద్ద ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. కానీ ఇదే మార్గంలో ఉన్న ఆనందపురం, పాలవలస, కోటగండ్రేడు, కలవచర్ల, చింతలపేట, గుర్ల తదితర అనుమతి లేని ప్రాంతాల నుంచి సైతం  ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం చేసేస్తున్నారు.

మండలంలో ఎక్కడికక్కడే ఇసుకను స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకుని ఇసుక డంపింగ్‌ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా లారీలతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రాత్రి వేళల్లో ఇసుక రీచ్‌ల నుంచి జేసీబీలతో లోడ్‌ చేసి మరి ఇసుకను తరలిస్తున్నారు.
వందలకొద్దీ లారీలతో ఎగుమతి
మండలంలో నిషేధించిన ఇసుక ర్యాంపుల నుంచి రోజుకు సుమారు 1500 క్యూబిక్‌ మీటర్లు(170 లారీలు) అక్రమంగా తరలిపోతున్నాయి. జిల్లాలో లారీలతో ఇసుకను తరలించడానికి ఎలాంటి అనుమతులు లేకపోయనప్పటికీ ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికా రులు మాత్రం పట్టించుకోవట్లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిమితికి మించి ఇసుక తవ్వకాలు చేపట్టడంతో చంపావతి నదీపరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటాయి.

దీని ఆధారంగానే సాగు చేస్తున్న రైతులకు నీటితడులు సక్రమంగా లేక పంట లకు నష్టం వాటిల్లుతోందంటూ ఆందోళన చెందుతున్నా రు. ముఖ్యంగా వ్యవసాయబోర్లు, విద్యుత్‌మోటార్ల నుంచి కూడా తగిన పరిమాణంలో నీరు రాకపోవడంతో సాగు నీటికోసం ఆ ప్రాంతాల్లోని రైతులు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై పలు మార్లు రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్, మైనింగ్‌ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
రక్షిత మంచినీటి పథకాలకు నీరు కరువు
ఇదిలా ఉండగా ఎస్‌.ఎస్‌.ఆర్‌.పేట, కోటగండ్రేడు తదితర ప్రాంతాల్లో తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి పథకాలు సైతం భూగర్భజలాలు అందక మొరాయిస్తున్నాయి. గుర్ల, నెల్లిమర్ల, గరివిడి మండలాలకు తాగు నీటి సరఫరా చేస్తున్న దేవుని కనపాక, కొండపాలెం తది తర రక్షిత మంచినీటి పథకాల సమీప ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో తాగునీటిని సైతం సరఫరా చేయడానికి సంబంధిత శాఖాధికారులు, సిబ్బంది పలు అవస్థలు పడుతున్నారు.

గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో నిషిద్ధ ప్రాంతాల్లో సైతం ఇసు క తవ్వకాలు చేపట్టడానికి అనధికార వేలం వేసి మరీ అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నా యి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్, తాగునీటి సరఫరా అధి కారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తరలించే ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలకు, అధికారులకు నెలవారీ మామ్మూ ళ్లు ఇస్తూ ఇసుకాసురులు తమ పని కానిచ్చేస్తున్నారని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
మండలంలోని నిషేధిత ర్యాంపుల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అధిక మొత్తంలో డంప్‌చేసిన స్టాక్‌ పాయింట్లను సీజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే పాలవలస గ్రామంలో 180 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను సీజ్‌ చేశాం. మరింత ఉధృతంగా ఇసుక ఆక్రమార్కులపై దాడులు చేస్తాం.       – పి.ఆదిలక్ష్మి, తహసీల్దార్, గుర్ల మండలం
లారీలతో ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు
జిల్లాలోని ర్యాంపుల నుంచి లారీలతో ఇసుక తరలించడానికి, ఇసుకను స్టాక్‌ వేయ్యడానికి ఎలాంటి అనుమతులు లేవు. ఎవరైనా అలా స్టాక్‌ చేసినా... లారీలతో తరలించినా... కఠిన చర్యలు తప్పవు.             – సాయిరాం. ఏడీ, మైనింగ్‌ అదికారి, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement