మునేరు నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా
వత్సవాయి : మునేరు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మండలంలోని ఆళ్లూరుపాడు క్వారీ నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండి పై సంపాదన లేక ఆవురావురుమంటున్న తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం వచ్చిన అవకాశాన్ని శాయశక్తులా వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అళ్లూరుపాడు క్వారీ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోప ణలున్నాయి. క్వారీ ప్రారంభమైనప్పటినుంచి పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు.
లారీల్లో పక్క రాష్ట్రానికి తరలింపు
నియోజకవర్గంలోని ఏదో ఒక గ్రామం పేరుతో మీసేవలో నగదు చెల్లించి రశీదును క్వారీలో ఉన్న డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందజేస్తున్నారు. అక్కడ నుండి లారీల్లో ఇసుకను నింపుకుని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ లోని హైదరాబాద్, కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, ైవైరా, మధిర వంటి ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించేవారు ఒకసారి బిల్లు తీసుకుని అనేక దఫాలుగా ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు రో జువారీ మామూళ్లు అందుతున్నాయని ప్రజ లు వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను లారీల్లో పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నా వాటి వేబిల్లులను రెవెన్యూ, పోలీ స్ అధికారులు తనిఖీ చేయడంలేదు. దీంతో అక్రమార్కుల ఇష్టారాజ్యంగా మారింది.
ఓవర్ లోడింగ్
మీసేవలో ట్రాక్టర్ మూడు క్యూబిక్ మీటర్లు చొప్పున నగదు చెల్లిస్తున్నారు. మూడు క్యూబిక్ మీటర్లంటే నాలుగు టన్నులన్నర ట్రాక్టర్ ట్రక్కుకు బాడీ వరకు సరిపోతుండగా సుమారు మరో టన్నున్నర అదనంగా రవాణా చేస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌కు ఆరు టన్నుల ఇసుకను రవాణా చేస్తున్నారు. అదనంగా ఇసుకను పోసినందుకు ఒక్కొక్క ట్రాక్టర్‌కు కొంత మొత్తంలో నగదును క్వారీలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారు. లారీల విషయానికి వస్తే జేసీబీతో సుమారు 35 నుంచి 40 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు.
సమయపాలన లేకుండా రవాణా
ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు క్వారీ నుండి ఇసుకను తరలించుకునే అనుమతి ఉంది. అయితే రాత్రి తొమ్మిది గంటల వరకు క్వారీ నుండి ఇసుకను రవాణా కొనసాగుతోంది. ఇదంతా పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. సమయపాలన ఎందుకు పాటించడంలేదని వెలుగు పథకం ఏపీఎం జె.నాగరాజును వివరణ కోరగా.. తమకు కేటాయించిన సమయం వరకే చూసుకుంటామని, తరువాత పోలీస్, రెవెన్యూ వారు చూసుకోవాలని సమాధానమిచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.