అ‘వే బిల్లులు’.. పదేపదే ఇసుక | Sand irregularities | Sakshi
Sakshi News home page

అ‘వే బిల్లులు’.. పదేపదే ఇసుక

Published Thu, Mar 17 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

గొట్టివాడ ఇసుక రీచ్‌లో అక్రమ దందా వాస్తవమేనని తేలిపోయింది. అధికారిక తరలింపు ముసుగులో అక్రమంగా ఇసుక తవ్వేస్తున్నారు.

గొట్టివాడ రీచ్‌లో ఆగని దందా
‘సాక్షి’ కథనానికి స్పందించి అడ్డుకున్న రైతులు..  అక్రమాలు బట్టబయలు
పాత బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్టు నిర్ధారణ

 
కోటవురట్ల:  గొట్టివాడ ఇసుక రీచ్‌లో అక్రమ దందా వాస్తవమేనని తేలిపోయింది. అధికారిక తరలింపు ముసుగులో అక్రమంగా ఇసుక  తవ్వేస్తున్నారు.  ఒక వేబిల్లుతో సుమారు 20 లారీల వరకు ఇసుకను అక్రమంగా తరలిపోతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ అక్రమ దందాపై ‘ఇసుకపై కన్నేసిని పచ్చ గద్దలు’ శీర్షికతో ఈ నెల 13న  సాక్షిలో ప్రచురితమైన  కథనం  ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దీంతో గురువారం గొట్టివాడ గ్రామస్తులు ఇసుక రీచ్‌పై దాడి చేసి లారీలను అడ్డగించారు. వేబిల్లులను తనఖీ చేయగా పలు ఆసక్తి   కర విషయాలు వెల్లడయ్యాయి.

స్థానికులకు చిక్కిన పాత బిల్లులు
ఈ నెల 8వ తేదీ, 15వ తేదీకి చెందిన సుమారు 30 బిల్లులను స్థానికులు పట్టుకున్నారు. రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే బిల్లును పలుమార్లు వినియోగిస్తున్నారని వెల్లడికావడంతో మండిపడ్డారు. కాసులకు కక్కుర్తిపడి రైతులను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్యుతాపురం మండలానికి భారీగా ఇసుకను తరలించవలసిన అవసరం ఏమిటని నిలదీశారు. అక్రమ దందాను ఆపకపోతే రీచ్ నుండి ఒక ఇసుక లారీని కూడా కదలనివ్వమని హెచ్చరించారు.

అమలుకాని నిబంధనలు
వాస్తవానికి అచ్యుతాపురం మండలంలో అవసరాల కోసం అక్కడి తహసీల్దారు శంకర్రావు పలు లారీలకు అనుమతి ఇస్తూ వేబిల్లులు ఇస్తున్నారు. ఆ వేబిల్లుపై మండల ఇంజినీరింగు అధికారి, స్థానిక సర్పంచ్ సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వేబిల్లును కోటవురట్ల తహసీల్దారు సునీలారాణి చేత ఆమోదించుకోవలసి ఉంటుంది. ఇంతతతంగం ఉంటే గాని ఇసుక లారీ కదిలే పరిస్థితి ఉండదు. ఇవేమీ పట్టించుకోకుండా కాని ఒకే వేబిల్లును పదే పదే వినియోగించి ఇసుకను భారీగా తరలించుకుపోతున్నారు. ఇందుకు అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తుండగా స్థానికంగా ఉన్న ఓ టీడీపీ కార్యకర్త దందా సాగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లారీ  నుండి సుమారు రూ.2 వేలు వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అదే లారీ నుండి రెవెన్యూ సిబ్బంది రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

అక్రమ దందాపై సీబీఐ కన్ను
మండలంలో సాగుతున్న అక్రమ ఇసుక దందాపై సీబీఐ కన్ను పడినట్టు సమాచారం. స్థానికులు సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రమేయం ఎంత అనే పలు అంశాలతో సీబీఐకి స్థానికులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై సీబీఐ ఆకస్మిక దాడి చేసి దర్యాప్తు చేసే అనేక వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు అంటున్నారు. సీబీఐ వరకు విషయం వెల్లడంతో రెవెన్యూ సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టు తెలిసింది.
 
సిబ్బందిపై తహసీల్దారు ఆగ్రహం
 ఈ వ్యవహారంపై తహసీల్దారు సునీలారాణి తీవ్రంగా స్పందించారు. రెవెన్యూ సిబ్బందిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఒక్క లారీ వెళ్లినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు కొత్త సిబ్బందిని పరిశీలనకు నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement