ఇసుకాసురులు
గుంటుపల్లి రీచ్‌లో సిండికేట్లు
అక్రమంగా కోట్లు మింగేస్తున్న వైనం
ప్రశ్నించిన డ్వాక్రా అధ్యక్షురాలిపై వేధింపుల పర్వం
కలెక్టర్‌కు ఫిర్యాదు
విజయవాడ : జిల్లాలో అడ్డగోలు ఇసుక దందాకు తెరలేచింది. రీచ్‌లో ఒక లారీ ఇసుక తవ్వినట్లు బిల్లు తీసుకుని ఆ బిల్లుపై దాదాపు 20 నుంచి 30 లారీల ఇసుకను యథేచ్ఛగా విక్రయించుకుని కొందరు సిండికేట్లు కోట్లు గడిస్తున్నారు. దీనికి పంచాయతీ అధికారులు సహకరించడంతో అక్రమ వ్యాపారం రెండు నెలల్లో కోట్లకు చేరింది. ఈ విషయం రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవటంతో పరిస్థితి పరాకాష్టకు చేరింది. ఈ అక్రమాన్ని ప్రశ్నించిన డ్వాక్రా సంఘ అధ్యక్షురాలిని బెదిరించడమే కాదు ఆమెను పదవి నుంచి దించే దిశగా సిండికేట్ అడుగులు వేస్తోంది. ఇదంతా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి ఇసుక రీచ్‌లో సాగుతున్న అక్రమ దందా.
అక్రమాల పుట్ట
బోట్స్‌మెన్ సొసైటీ నిర్వహణలో నడిచిన గుంటుపల్లిలోని ఇసుక రీచ్‌లో తవ్వకాలను హైకోర్టు ఉత్తర్వులతో 2012 మార్చి నుంచి నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను ద్వాక్రా సంఘాలకు అప్పగించడమే కాకుండా విక్రయాల వ్యవహారాన్ని ఆన్‌లైన్ చేశారు. 2014, అక్టోబర్ 11న ఈ రీచ్‌ను పునరుద్దరించి అక్కడి ద్వాక్రా సంఘ అధ్యక్షురాలు నలజాల గీతాంజలికి బాధ్యతలు అప్పగించారు. ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్న లారీకి రూ.3,900 ధర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో రూ.1,380 బోట్స్‌మెన్ సొసైటీకి, మిగిలిన మొత్తం ద్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వానికి వస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు రీచ్ మూతపడి ఉండటంతో ఇసుక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. వాస్తవానికి రీచ్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న గుంటుపల్లి సాండ్ మైనింగ్ మ్యూచ్‌వల్ కో-ఆపరేటివ్ సొసైటీ పర్యవేక్షణలో వ్యవహారమంతా సాగాలి. కొనుగోలుదారులు ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌చేసి ఆ రశీదు రీచ్‌లో చూపితే అక్కడి ద్వాక్రా సంఘం ముద్రించిన పర్మిట్ స్లిప్ ఇస్తారు. దానిని చూపించి ఇసుకను లోడ్ చేసుకోవాలి. అలా ద్వాక్రా సంఘం ఇచ్చిన ప్రతి రశీదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అప్పుడే ఆ రీచ్ నుంచి రోజుకు ఎన్ని లారీల ఇసుక విక్రయాలు జరిగిందని అధికారికంగా తెలుస్తుంది. ప్రభుత్వ ఖజానాకు నగదు జమ అవుతుంది.
కానీ, అందుకు విరుద్ధంగా గుంటుపల్లి ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి. తవ్వకాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఇద్దరు వెలుగు ఉద్యోగులు వారికి అనుకూలమైన వ్యక్తుల్ని ఆపరేటర్లుగా నియమించుకున్నారు. ఈ క్రమంలో ద్వాక్రా సంఘం ఇస్తున్న రశీదు బిల్లులేవీ ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు కావట్లేదు. రీచ్ నుంచి రోజూ సగటున 70 లారీల ఇసుక తవ్వుతుంటే, సుమారు 70 వరకు ద్వాక్రా సంఘాలు రశీదులు ఇస్తుండగా, వాటిలో 20 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదవుతున్నాయి. మిగిలినవి లెక్కల్లోకి రావట్లేదు. అధికారికంగా నమోదు చేస్తున్న లారీల్లో కూడా తేడాలు వస్తున్నాయి. ఒకే బిల్లును రెండు, మూడుసార్లు నమోదు చేయడం వల్ల ఆన్‌లైన్ రెడ్‌మార్క్ పడి నమోదు కావట్లేదు. గత డిసెంబర్ నుంచి మార్చి వరకు దాదాపు వందల లారీల ఇసుక అనధికారికంగా తరలివెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు రూ.2కోట్ల విలువైన ఇసుక సిండికేట్ల పరం అయింది. ఇక్కడి బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులు కొందరు, ఇద్దరు అధికారులు కలిసి ఇదం తా చేస్తున్నారు. పలు ఆరోపణల నేపథ్యంలో సబ్ కలెక్టర్ నాగలక్ష్మి జనవరిలో రీచ్‌ను సందర్శించారు.
ప్రశ్నిస్తే వేధింపులే..
దీనిని డ్వాక్రా సంఘ అధ్యక్షురాలు గీతాంజలి ప్రశ్నించటంతో ఆమెపై వేధింపులు మొదల య్యాయి. వెలుగు అధికారులను ఆమె ప్రశ్నించడం, బిల్లులు, ఆన్‌లైన్ లిస్ట్ తనకు చూపాలని కోరటంతో వేధింపులకు దిగుతున్నారు. దీనిపై ఆమె గత సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వేధింపులు తీవ్రం కావటంతో పాటు ద్వాక్రా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించే యత్నాలు సాగుతున్నాయి.